తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారుల మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి పౌరసరఫరాల శాఖ తెరదించింది. ఈ నెల 31లోగా e-KYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) పూర్తి చేయకపోతే ప్రభుత్వం పంపిణీ చేయనున్న ‘సన్నబియ్యం’ నిలిపివేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర స్పందిస్తూ.. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బియ్యం పంపిణీని నిలిపివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టమైన వివరణ ఇచ్చారు.
Latest News: AP Politics: PPP మోడల్‌పై జగన్ విమర్శలు, మంత్రి కౌంటర్
e-KYC ప్రక్రియ అనేది రేషన్ కార్డులో ఉన్న లబ్ధిదారుల వివరాలను ధృవీకరించుకోవడానికి చేసే ఒక ప్రామాణిక చర్య అని అధికారులు తెలిపారు. కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరు కనీసం ఒక్కసారైనా రేషన్ దుకాణానికి వెళ్లి తమ వేలిముద్రలు (Biometric) లేదా కనుపాప గుర్తులను (Iris) నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి తుది గడువు (Deadline) విధించలేదని కమిషనర్ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఎవరినీ రేషన్ కు దూరం చేసే ఉద్దేశం లేదని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తులో రేషన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఈ e-KYC ప్రక్రియ పూర్తి చేయడం మేలని ప్రభుత్వం సూచిస్తోంది. ముఖ్యంగా అనర్హుల పేర్లను తొలగించడానికి, అలాగే కార్డులో ఉండి చనిపోయిన వారి పేర్లను గుర్తించడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుంది. లబ్ధిదారులు ఆందోళనతో రేషన్ షాపుల వద్ద గుమికూడకుండా, తమకు వీలైన సమయంలో వెళ్లి ఈ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ తెలిపింది. ప్రభుత్వ అధికారిక ప్రకటనలతో క్షేత్రస్థాయిలో ఉన్న అయోమయం తొలగిపోయినట్లయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com