हिन्दी | Epaper
మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి

The Gift of a Daughter : కన్యాదానం

Abhinav
The Gift of a Daughter : కన్యాదానం

ఇందాకటి నుండి ఆ ఫోను మెడ తెగిన మేకలా అరుస్తూ ఉంటే పట్టించుకోకుండా వంటింట్లో ఏం చేస్తున్నావు? బంగారం లాంటి నిద్ర పాడు చేసింది వెధవ ఫోను.. వెధవ “ఫోను” కప్పుకున్న దుప్పటి ముసుగు ఏమాత్రం తీయకుండానే బెడ్ రూమ్లో నుంచి పెద్దగా అరిచాడు వినయ్, నిద్ర పాడైందనే చిరాకుతో. “ల్యాండ్లైన్కి మీ అమ్మగారు తప్ప ఫోన్ ఎవరు చేస్తారు? మీరే లేచి ఫోన్ తీసి మాట్లాడండి” వంటింట్లో నుంచే అరుస్తూ జవాబిచ్చింది సురేఖ. “ఏం? మా అమ్మ ఫోన్ అయితే నువ్వు ఎత్తి మాట్లాడకూడదా?” ముసుగు తీయకుండానే మళ్లీ అరిచాడు వినయ్. “ఆవిడగారు నేను ఫోను ఎత్తితే జవాబు ఇవ్వదు కదా? అయినా మీ తల్లి కొడుకుల మధ్య నేను ఎందుకు చెప్పండి. మీకేం రహస్యాలు ఉన్నాయో? మీరే వచ్చి ఫోన్ తీయండి” అంటూ అదే స్థాయిలో మళ్లీ తిరిగి జవాబు ఇచ్చింది సురేఖ. ఇక తప్పదు అనుకుంటూ కప్పుకున్న దుప్పటి ముసుగు తీసేసి “ఛ..ఛ.. వెధవ ఫోన్లు.. ఆదివారం కూడా కాసేపు పడుకోనివ్వరు” అని తనలో తనే గొణుక్కుంటూ ల్యాండ్ లైన్ రిసీవర్ అందుకుని చెవి దగ్గర పెట్టుకుని మళ్లీ కళ్లు మూసుకున్నాడు. వినయ్ నిలబడే నిద్రపోతున్నవాడిలా. అవతలివాళ్లు చెప్పేదంతా మౌనంగా వింటూ, ఒక ఐదు నిమిషాల తర్వాత, ఉలుకు పలుకు లేకుండా రిసీవర్ని ఫోన్ మీద పెట్టేసి నిద్రలో నడిచేవాడిలా నడుచుకుంటూ బెడ్ రూమ్లోకి వెళ్లి మళ్లీ ముసుగుతన్ని పడుకున్నాడు. 

వినయ్. ఏ విషయం తనకు చెప్పకుండా భర్త మళ్లీ ముసుగు తన్నేయడంతో కాస్తం కోపంతో “ఎవరండీ ఫోను? మీ అమ్మగారేనా?” వంటింట్లో నుంచి సురేఖ అరిచింది. అప్పటికే దాదాపుగా నిద్రమత్తు వదిలిపోవడంతో ఇక నిద్ర పోవడం సాధ్యపడదని నిర్ణయించుకుని, కప్పుకున్న ముసుగు తీసేసి లేచి కూర్చుని “అవునుగానీ ముందు ఒక కప్పు కాఫీ నా ముఖాన తగలెయ్, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం” అంటూ జవాబిచ్చాడు వినయ్. అత్తగారు ఏం మాట్లాడిందో తెలుసుకోవాలనే ఆతృతతో, అర నిమిషంలో కాఫీ కప్పుతో మొగుడి ఎదురుగా నిలబడింది. కాఫీకప్పు అందుకుంటూ “అత్తగారి ఊసంటేనే పడదు, కానీ మళ్లీ ఆవిడ ఏం మాట్లాడిందో మాత్రం పూస గుచ్చినట్టు అన్నీ కావాలి” సురేఖను దెప్పి పొడిచ్చాడు వినయ్. “మీరు, ఆవిడగారు ఏం మాట్లాడుకుంటే నాకెందుకు? కాకపోతే నా గురించి ఏమన్నా మీకు చాడీలు చెప్పిందేమోనని..” అంటూ సాగదీసింది సురేఖ. “అనుమానం పుట్టి, మీ ఆడవాళ్లు పుట్టారనుకుంటా, ఏముంటాయి? నీ గురించి  నాకు చెప్పడానికి” అంటూ తల్లిని వెనకేసుకొచ్చాడు వినయ్, “సరేలెండి, ఎప్పుడూ మీ అమ్మా కొడుకులు ఒకటే, నేనే బయటిదాన్ని. ఇంతకీ తెల్లవారకముందే ఆవిడగారు ఎందుకు ఫోన్ చేసిందో, అదన్నా చెప్తారా? లేక నా వంటపని నన్ను చూసుకోమంటారా?” అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది సురేఖ. 

ఇంకా ఆలస్యం చేస్తే ఈ పూటకి బ్రేక్ ఫాస్ట్ బయట హోటల్లో చేయాల్సి వస్తుందని భయపడి “ఏం లేదోయ్, చెల్లికి మంచి సంబంధం కుదిరిందట, మనం కూడా ఒకసారి చూసి ఒకే అంటే నిశ్చితార్థం చేస్తుందట అమ్మ. అది చెప్పడానికే ఫోన్ చేసింది” అంటూ అసలు విషయం బయట పెట్టాడు. వినయ్. “చెల్లెలా! ఎవరి చెల్లెలు? మీకు తమ్ముడు ఉన్నాడుగానీ, చెల్లెలు కూడా ఉన్నట్టు నాకు ఎప్పుడూ చెప్పలేదు మీరు?” మొహం నిండా ఆశ్చర్యం పులుముకున్నదానిలా భర్తను అడిగింది సురేఖ. “ఏమిటోయ్, నీకు అన్నీ తెలిసి కూడా అలా మాట్లాడతావు? గౌరి నీకు తెలియదా? మన పెళ్లయిన దగ్గర నుండి అమ్మ పెంచుకుందిగా?” అంటూ గుర్తు చేశాడు వినయ్. “ఓ… ఆ గౌరా? ఆ పని పిల్లా? మరి చెప్పారు కాదు, చెల్లెలు అంటే ఇంకా ఎవరో అనుకున్నాను” సందేహం తీరిన దానిలాగా ఓ నిట్టూర్పు విడిచింది. సురేఖ. “అవును, ఆ పనిపిల్ల గౌరికే మంచి సంబంధం కుదిరిందట. అమ్మ మనల్ని కూడా వచ్చి చూడమంటోంది. వెళ్లామా?” భార్య అంతరార్థం అర్థమైనవాడిలా బతిమిలాడుతున్నట్టు అడిగాడు. “అయినా ఇదెక్కడి చోద్యం అండీ! ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేదు. పనిపిల్లని పెంచుకోవడం ఏమిటి? దానికి చదువు చెప్పించటం ఏమిటి? ఇప్పుడు పెళ్లిళ్లు, పేరంటాలు అంటూ మనల్ని పిలవటం ఏమిటి? అయినా అంతగా పెంచుకోవాలనుకుంటే మన అమ్మాయిని పెంచుకోవచ్చు కదా!” అత్తగారి మీద తన అక్కసు మొత్తం వెళ్లగక్కింది. సురేఖ. “అన్నీ తెలిసినవాళ్లకైనా చెప్పొచ్చు లేక ఏమీ తెలియనివాళ్లకైనా చెప్పొచ్చు.

అన్నీ తెలిసీ తెలియనట్టు నటించే సురేఖకు ఏమి చెప్పినా ఉపయోగం లేదని మౌనంగా ఉండిపోయాడు వినయ్. “అదేమిటమ్మా? ఇద్దరు కొడుకులం మేం ఉండగా నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉంటాను అంటావు. మా దగ్గరకు వచ్చేయొచ్చు కదా? నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉంటే ఊళ్లో వాళ్లందరూ ఏమనుకుంటారు చెప్పు. మేం నిన్ను సరిగా చూసుకోవట్లేదని అనుకోరా?” తల్లిని బతిమిలాడుతున్నట్టు అడిగాడు వివేక్. “ఊళ్లోవాళ్ల ఏదో అనుకుంటారని తప్ప, నా మీద మీకు నిజంగా ప్రేమ లేదన్నమాట” కొడుకుల్ని అడిగింది అనసూయమ్మ. “ప్రేమ ఉండబట్టే కదమ్మా, చెరొక ఆరు నెలలు మేం ఇద్దరం నిన్ను మా దగ్గర ఉంచుకుంటున్నాం” ఏదో ఘనకార్యం చేసినవాళ్లలాగా జవాబిచ్చారు అన్నదమ్ములు ఇద్దరు. “అమ్మను కూడా తూకం వేసి ఆరు నెలలు, ఆరు నెలలు పంచుకునే మీ లాంటి కొడుకుల దగ్గర ఉండలేకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను ఇలాగే ఇక్కడ ఉండనివ్వండి, మీ నాన్నగారి జ్ఞాపకాలతో నా చివరి రోజులు సంతోషంగా గడపనివ్వండి” తన నిర్ణయానికి తిరుగు లేదన్నట్టు కొడుకులకు స్పష్టం చేసింది. అనసూయమ్మ. “అదేంటి అత్తయ్యా, అలా అంటారు? హైదరాబాదు లాంటి సిటీలో ఒక మనిషిని పోషించడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియంది కాదు. అందుకే మేం చెరొక ఆరు నెలలు మిమ్మల్ని చూస్తున్నాం” తాము చేస్తున్న దాంట్లో ఏమీ తప్పులేదు అన్నట్టు సమర్థించడానికి ప్రయత్నించింది. 

చిన్న కోడలు సుషమ “ఇద్దరు పిల్లల్ని పెంచడం కష్టమని, నేను మీ మామగారు కూడా అనుకుని ఉంటే మీ ఆయన భూమి మీద పడేవాడే కాదమ్మా!” చిన్న కోడలికి చురక అంటించింది అనసూయమ్మ. “అది కాదు అత్తయ్యా, మీకు ఏదైనా జబ్బు చేసిందనుకోండి, ఇక్కడ ఎవరు చూస్తారు చెప్పండి?” మరో ప్రశ్న వేసింది పెద్ద కోడలు సురేఖ. “మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రం నాకు జబ్బు చేసినప్పుడు ఎవరు చూశారు అమ్మా? మీ మానాన మీరందరూ ఉద్యోగాలకు వెళితే నేను మాత్రం మంచానికి అతుక్కుపోయాను. ఏదో అదృష్టం బాగుండి బతికి బయట పడ్డాను. కానీ..” అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది అనసూయ. “ఏం చేస్తాం చెప్పమ్మా? అందరం ఉద్యోగాలు చేసేవాళ్లమే కదా! వాటిని వదిలి నీ దగ్గర ఉండలేం కదా. అయినా నీకు జబ్బు చేసినప్పుడు నిన్ను చూసుకోవటానికి పనిమనిషిని పెట్టాం కదా” అనసూయమ్మను సముదాయించడానికి ప్రయత్నించాడు పెద్ద కొడుకు వినయ్. “నేను కూడా అదే నాన్నా చెప్పేది. ఆ పనిమనిషిని ఏదో ఇక్కడే పెట్టుకుని, బతికిన నాలుగు రోజులు ఇక్కడే కాలక్షేపం చేసేస్తాను. పైపెచ్చు నాకేదైనా అయితే ఇక్కడ చుట్టుపక్కల వాళ్లందరూ నా కోసం ప్రాణం ఇస్తారు. మీ నాన్నగారి చివరి క్షణాల్లో కూడా వీళ్లందరూ కంటికి రెప్పలా కాచుకున్నారు. కానీ ఏం. వేస్తాం? ఆ పైవాడు దయ తలచందే. మీకు ఒక నేను ఏమాత్రం భారం కాదల్చుకోలేడు” నిష్కర్షగా తన నిర్ణయాన్ని కొడుకులిద్దరికీ తెలియతిప్పింది అనసూయమ్మ, ఇక చేసేదేమీ లేదు అన్నట్టు. 

అన్నదమ్ములు ఇద్దరూ తల్లి ఖర్చులకోసం. నెల నెలా డబ్బులు పంపుతామని చెప్పారు. ఆ నిర్ణయాన్ని కూడా అనసూయమ్మ సున్నితంగా తిరస్కరించింది. “నాకు ఈ పల్లెటూర్లో ఏం ఖర్చులు ఉంటాయి చెప్పండి. ఉండటానికి మీ నాన్నగారు లంకంత ఇల్లు ఇచ్చిపోయారు. ఇంట్లో సగం అద్దెకిస్తాను, ఆ వచ్చే అద్దెతో కృష్ణా.. రామా అంటూ కాలం గడిపేస్తాను. మీరు నా గురించి అలోచించకుండా మీ పిల్లల గురించి అలోచించండి. అసలే సిటీలో ఖర్చులు ఎక్కువ” తన వాళ్ల దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం లేదని చెప్పకనే చెప్పింది అనసూయమ్మ. “అమ్మగారూ, ఇంటి పని, వంట పని అంతా మీరు ఒక్కళ్లే ఎలా. చేసుకుంటారు? పోనీ నా కూతుర్ని మీ దగ్గర పనిలో పెట్టమంటారా?” అడిగింది తమ దగ్గర ఒకప్పుడు పాలేరుగా పని చేసిన సోమయ్య భార్య తులసమ్మ. “వద్దు తులసమ్మా, దాని జీవితం ఎందుకు పాడు చేస్తావు? దానిని చక్కగా చదివించి ఒక అయ్య చేతిలో పెట్టు” అంటూ తులసమ్మ విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించింది అనసూయ. “ఇప్పుడు అది చదివి ఏ ఊళ్లు ఏలాలి. అమ్మా? అయినా మా బోటి రెక్కాడితేగానీ డొక్కాడని వాళ్లకు చదువులు చెప్పించే స్థోమత ఎక్కడుందమ్మా?” తన నిస్సహాయతను బయట పెట్టుకుంది తులసమ్మ. సోమయ్య పోయిన దగ్గర నుంచి తులసమ్మే నాలుగిళ్లలో పని చేస్తూ తన పిల్లల్ని పెంచి పోషిస్తోంది. 

అప్పటికప్పుడు ఏదో ఆలోచన వచ్చినదానిలా “అయితే పని చేయి తులసమ్మా, నీ కూతుర్ని నా దగ్గర అట్టిపెట్టు. దానిని నేను చదివిస్తాను, నాకు తోడుగాను అది ఉంటున్నట్టు ఉంటుంది… ఏమంటావ్?” అడిగింది అనసూయమ్మ. “దాన్ని మీరు చదివిస్తాను అంటే మాకు అంతకంటే ఏం కావాలమ్మా?” రెండు చేతులు ఎత్తి జోడించి నమస్కరించాడు. ఆ రోజు నుండి సోమయ్య కూతురు గౌరి అనసూయమ్మ ఇంట్లో పనిపిల్లగా చేరింది. పేరుకు పనిపిల్లే, కానీ అనసూయమ్మ సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకోవడం మొదలు పెట్టింది. వాళ్లిద్దర్నీ చూసినవాళ్లు నిజమైన తల్లీకూతుళ్లు అనుకుంటారు తప్ప ఎవరికీ గౌరి ఓ పనిపిల్ల అనే అనుమానం ఏమాత్రం కలగదు. తులసమ్మకు మాట ఇచ్చినట్లే గౌరిని డిగ్రీ వరకు చదివించింది. అనసూయమ్మ. ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం కూడా సంపాదించుకుంది గౌరి. ఇప్పుడు గౌరికి తనే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని నిర్ణయించుకుంది. అనుకున్నట్లే గౌరి అదృష్టమో లేక అనసూయమ్మ సంకల్ప బలమో తెలియదుగానీ ఒక మంచి సంబంధం కుదిరింది. “ఇంతకీ మీ తమ్ముడు, మరదలు కూడా వచ్చారా పెళ్లిచూపులకి? తగుదునమ్మా అంటూ మీరు వెళ్లి వచ్చారు” సన్నాయి నొక్కులు నొక్కింది సురేఖ. “వాడు రాకుండా ఎలా ఉంటాడు? ఎంతైనా మా ఇద్దరి రక్తం, ఆలోచనలు ఒకటే కదా?” సమాధానం ఇచ్చాడు వినయ్. 

ఆ జవాబుతో మొఖం పాలిపోయిన దానిలా “మరి మీ మరదలు కూడా వచ్చిందా?” అంటూ నసిగింది సురేఖ. “ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది? ఎంతైనా నీలాగా బయటిది కదా?” నిర్మొహమాటంగా అన్నాడు వినయ్. “అవునులెండి కట్టుకున్న పెళ్లాలు. మాత్రం బయటవాళ్లు, ఎవరో పనిపిల్ల మాత్రం మీకు, మీ తమ్ముడికి ఎక్కువైంది” ఉదుక్కుంది. సురేఖ, “ఇంతకీ కట్నకానుకలు ఏమిస్తోందంట మీ అమ్మగారు?” వెక్కిరింతంగా అడిగింది సురేఖ. “పెళ్లికొడుకు తల్లిదండ్రులు చాలా మంచివాళ్లు, వాళ్లు కట్నకానుకలు ఏమీ అడగలేదు. నిజంగా గౌరి చాలా అదృష్టవంతురాలు” మొహం మీద కొట్టినట్టు చెప్పాడు వినయ్, “మరి.. కనీసం పెళ్లి అన్నా చేయాలిగా, సొంత కూతురులాగా పెంచుకున్నందుకు, మీ అమ్మగారు?” కడుపుమంట ఇంకా తీరనట్టు ప్రశ్నించింది సురేఖ. “అమ్మ దగ్గర డబ్బులు ఏముంటాయి. చెప్పు? ఇంటి మీద వచ్చే అద్దెతోనే ఇన్నాళ్లూ కాలం గడుపుతూ వస్తోంది. అందుకనే మేం అన్నదమ్ములం ఇద్దరం పెళ్లిఖర్చులు భరించటానికి ఒప్పుకున్నాం” అసలు విషయం చల్లగా బయట పెట్టాడు వినయ్. “నేను అనుకుంటూనే ఉన్నా ఇలాంటిదేదో జరుగుద్దని. ఎవరిని అడిగి మీరు పెళ్లి ఖర్చు భరిస్తానని చెప్పారు. లక్షలకు లక్షలు మీరు బయటవాళ్ల కోసం తగలేస్తూ ఉంటే నా పిల్లల గతి ఏంకాను? అహం చల్లారని సురేఖ పెద్దగా అరవడం మొదలుపెట్టింది. 

“ఎందుకలా అరుస్తావ్? ఈ పది వన్నెండేళ్లు అమ్మ మన దగ్గర ఉంటే ఎంత ఖర్చు అయ్యేది చెప్పు? ఆ డబ్బులే ఇప్పుడు పెళ్లి ఖర్చులకోసం ఇద్దరం ఖర్చు చేస్తున్నాం. ఇందులో నీ పిల్లలకు అన్యాయం ఎక్కడ జరిగింది” సురేఖ నోరు మూయించాడు వినయ్. “అయినా మీ తోడికోడళ్లు ఇద్దరూ అమ్మకు ఇంత ముద్ద పెట్టడానికి వంతులు వేసుకోకుండా ఆవిడని కళ్లల్లో పెట్టకుని చూసుకుని ఉంటే గౌరి అవసరమే వచ్చేది కాదు, ఇప్పుడు పరిస్థితి ఇంతదాకా  రాదు కదా!” సురేఖ చేసిన తప్పు ఎత్తి చూపాడు వినయ్. తను ఎంత తప్పు చేశానో తెలిసిందానిలా మౌనంగా తల దించుకుంది సురేఖ. “నిజానికి అమ్మ గౌరి పెళ్లి చేయాలంటే మమ్మల్ని అడగాల్సిన  అవసరం కూడా లేదు. తను ఉంటున్న ఇల్లు అమ్మేసి ఆ డబ్బుతో పెళ్లి చేసేది.. కానీ ఆ ఇల్లు ఎప్పుడో మన కూతురు పేరున రాసేసిందట, దాని పెళ్లప్పుడు కట్నం కింద పనికి వస్తుందని” తన తల్లి ఔదార్యాన్ని అర్ధం చేసుకోమన్నట్లు తెలియచెప్పాడు వినయ్. “ఇల్లు మనమ్మాయి పేరున రాసేస్తే మీ అమ్మగారు రేపటి నుండి ఎక్కడ ఉంటుందండీ?” ఇంకా ఎక్కడో అనుమానం మిగిలి ఉండగా అడిగింది సురేఖ. “ఆమె, నీ కూతురికి ఆస్తి రాసింది. కదా అని నీ ఇంటికి ఏమి రాదులే, భయపడకు, అమ్మ బతికున్నంత కాలం తన దగ్గరే ఉంచుకుంటానని గౌరీ తన భర్తను ఒప్పించిందట.

అతను కూడా చాలా మంచివాడిలా ఉన్నాడు. అడిగిన వెంటనే ఒప్పుకున్నాడట. గౌరికి అమ్మ మీద ఉన్న ప్రేమ ముందు కన్న కొడుకులం మేమిద్దరం తల దొచుకోవాల్సి వచ్చింది. అందుకనే గౌరిని దేవుడు ఇచ్చిన చెల్లిగా భావించి, పెళ్లి ఖర్చులు మేమిద్దరం పెట్టుకోవడానికి ఒప్పుకున్నాం, కాస్తన్నా మేం చేసిన తప్పు సరిదిద్దుకున్నవాళ్లం అవుతామని” వివరంగా తెలియచెప్పాడు వినయ్. అప్పటికిగానీ తాను అత్తగారి పట్ల ఎంత నిర్దయగా ప్రవర్తించిందో అర్థం కాలేదు సురేఖకు. “ఏమండీ, నన్ను క్షమించండి. అత్తయ్య పట్ల నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది. గౌరికి దగ్గరుండి మనమే కన్యాదానం చేద్దాం. అప్పుడైనా నేను చేసిన తప్పును భగవంతుడు క్షమిస్తాడేమో!” అంటూ కళ్లనీళ్ల పెట్టుకుంది సురేఖ. నిజానికి తన తల్లి కోరుకుంది కూడా. అదే. కానీ సురేఖ ఏమంటుందో ఏమోనని తల్లికి మాట ఇవ్వలేకపో యాడు, ఇంత త్వరగా సురేఖలో మార్పు వస్తుందని ఊహించని వినయ్. “అంతకన్నా ఏం కావాలి సురేఖా? నువ్వు చెప్పినట్లే చేద్దాం. గౌరికి మనమిద్దరం ఇకమీదట అండగా నిలబడదాం. అమ్మ కూడా సంతోషిస్తుంది” అంటూ తన తల్లికి ఆ విషయం చెప్పడానికి ఉపక్రమించాడు. వినయ్.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870