కోట్లు కురిపించే సినీ పరిశ్రమకు పైరసీ బెడద పట్టుకుని పీడిస్తోంది
వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాను నిర్మిస్తే విడుదల అయిన రోజునే వెబ్సైట్లలో పైరసీ వెలువడుతోంది. అది కూడా హెచ్ క్వాలిటీతో రావడం కలవరపెడుతోంది. ముఖ్యంగా పైరసీ చిత్రాలను వెలువరిస్తున్న ఐ బొమ్మ వెబ్సైట్ వల్ల సినీ రంగానికి వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.
ఈ సైట్ను నిర్వహిస్తున్న రవిని పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. ఎక్కడో కరేబియన్ దీవుల్లో నివాసం ఏర్పాటు చేసుకుని తెలుగు చలనచిత్రాలను పైరసీ చేయడం ప్రారంభించాడు. అతనిని పట్టుకోవడం పోలీసులకు సాధ్యం కాదన్న అనుమానాలు వెల్లడయ్యాయి.
అయితే అనుకోకుండా హైదరాబాద్కు వచ్చిన రవిని పోలీసులు పట్టుకోగలిగారు. అంతేకాకుండా అప్పటికప్పుడు ఐబొమ్మ సైట్ను మూసివేశారు. దీనితో చలనచిత్ర రంగ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. అయితే అనూహ్యంగా ప్రజల నుంచి వ్యతిరేక వెల్లడైంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కేవలం సినిమాలే వినోదాన్ని అందిస్తున్నాయి.
రిసార్ట్లకు, పబ్లకు, టూరిజం స్పాట్లకు వెళ్లడానికి డబ్బులేని ఈ కుటుంబాలు కేవలం సినిమా ద్వారా మాత్రమే వినోదంతో పాటు దైనందిన జీవితాల నుంచి కొంత విశ్రాంతిని, ఉపశమనాన్ని పొందుతున్నాయి. కేవలం 30,50 రూపాయలతో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలను ఆస్వాదించేవారు.
అయితే ఆధునిక సాంకేతిక పెరగడంతో మల్టీప్లెక్స్లు వచ్చాయి. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. అదేవిధంగా పాన్ ఇండియా అని, పూర్తి స్థాయి గ్రాఫిక్స్ అంటూ చిత్ర నిర్మాణ ఖర్చులను నిర్మాతలు పెంచుకుంటూ వెళుతున్నారు. ఈ డబ్బును రాబట్టుకోవడానికి తప్పనిసరిగా మల్టీప్లెక్స్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
అదేవిధంగా సినిమా విడుదల అయిన కొన్ని రోజుల వరకూ టికెట్ ధరలను రెట్టింపు చేస్తున్నారు. అధికారికంగా పెంపుదలకు తోడు కొన్ని థియేటర్లలో అదనపు రుసుము కూడా వసూలు చేస్తున్నారు. గతంలో నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం సినిమాకు వెళితే టికెట్లకు రెండు వందల నుంచి మూడు వందల వరకు, ఇంటర్వెల్ సమయంలో పాప్కార్న్, టీ, కూల్ డ్రింక్ లు కొనుగోలు చేసేవారు.

దీనితో 4 వందల రూపాయలు పెడితే ఇంటిల్లిపాది వినోదాన్ని పొంది ఇంటికి తిరిగి వచ్చేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. సాధారణ రోజుల్లో మల్టీప్లెక్స్ లలో కనీస టికెట్ ధర 250 రూపాయలుగా ఉంది. పాప్కార్న్ ను 200 నుంచి 300 రూపాయలకు విక్రయిస్తున్నారు. కూల్డ్రింక్లను 150 రూపాయలకు, స్నాక్స్ ఏదైనా 300 రూపాయలు ఉంటోంది.
ఈ లెక్కన చూస్తే నాలుగురు సభ్యులు ఉన్న కుటుంబం ప్రస్తుతం సినిమాకు వెళితే రెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. నెలకు 10 నుంచి 15 వేల రూపాయలు సంపాదించే కుటుంబాలు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. వీరు సినిమాకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీనికి పరిష్కారంగా ఇంట్లోనే నెట్ కనెక్షన్ పెట్టుకుంటే రోజువారీ టివి ప్రొగ్రాంలు, సీరియల్స్, క్రికెట్ వంటివి చూడటంతో పాటు ఐబొమ్మ వంటి వెబ్సైట్లలో సినిమా విడుదల అయిన రోజే చూడగలుగుతున్నారు.
అందుబాటులో లేకుండా పోతున్న వినోదం కోసం సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. వీరి అవసరాన్ని గుర్తించి ఐబొమ్మ రవి వంటి వారు పైరసీ బాట పడుతున్నారు.
సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చును గణనీయంగా పెంచుకుంటూ వెళుతున్నారు. గతంలో 50 లక్షలతో సినిమాను నిర్మిస్తే ప్రస్తుతం 500 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. గతంలో సినిమా వంద రోజులు అడితే గొప్పగా చెప్పేవారు. ప్రస్తుతం కేవలం వారం రోజుల్లో రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వసూలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇలాంటి సినిమాల వల్ల వేళ్లపై లెక్కించే కొందరు సినీ హీరోలు, దర్శకులు, నిర్మాతలు మాత్రమే లాభపడుతున్నారు. ఇటు ప్రజలు అటు సినీ కార్మికులు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
సినీ నిర్మాణం సమయంలో ఖర్చులు బ్యాలన్స్ తప్పుతున్నాయి. ఈ ప్రభావం ప్రజలపై పడుతుంది. ఈ విషయాన్ని సినీ నిర్మాతలు, హీరోలు గుర్తించి తమ వైఖరిని మార్చుకోకపోతే ఐబొమ్మ రవి వంటి వారు పుట్టుకు వస్తూనే ఉంటారు. పైరసీలు చేస్తూనే ఉంటారు.
- డాక్టర్ గిరీష్ కుమార్ సంఘీ
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: