అల్లవరం, జొన్నగిరి అనే రెండు గ్రామాల మధ్య స్వర్ణసింధు అనే నది ప్రవహిస్తోంది. దసరా ఉత్సవాలలో భాగంగా ఆ నది మీద ప్రతి సంవత్సరం ఈతల పోటీలు జరుగుతుంటాయి. ఈ ఈతల పోటీలు నిర్వహించేది అల్లవరం గ్రామపెద్ద రంగరాయుడు. అతనికి ఈతల పోటీలు అంటే చాలా సరదా. విజేతలను అప్రకటిత భారీ బహుమతులతో సత్కరించడం అతని అలవాటు.
ఆరోజు ఈతల పోటీలను తిలకించడానికి జనం తండోప తండాలుగా చేరుకున్నారు. పోటీదారులు అల్లవరం గట్టు నుంచి జొన్నగిరి గట్టుకు ఎవరు ముందు చేరు కుంటారో వారే విజేతలు. ఆరోజు స్వర్ణసింధు నది సాధారణ స్థితికన్నా ఎక్కువ వేగంతో ప్రవహిస్తోంది. నదీ ప్రవాహానికి భయపడి కొంత మంది పోటీ నుంచి విరమించుకున్నారు. అత్యంత ధైర్యసాహసాలు ఉన్న పదిమంది యువకులు పోటీలో పాల్గొనడానికి సంసిద్ధులయ్యారు.

నిర్ణీత సమయం రాగానే అల్లవరం గ్రామపెద్ద, పోటీ లు ప్రారంభిస్తున్నట్టుగా పచ్చజెండా ఊపాడు. పోటీదారులందరూ ఉత్సాహంగా నదిలోకి దూకారు. గెలవబోయేది నేను అంటూ ఒకరిని దాటుకొని మరొకరు ముందుకు వెళుతుంటే, వారిని దాటుకొని ఇంకొకరు ముందుకు దూసుకుపోతూ ఇలా పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి.
వెళ్లవలసిన దూరంలో మూడువంతులు అధిగమించిన పిమ్మట, ఒక దుష్సంఘటన జరిగింది. సురేంద్ర అనేవాడు గెలవాలని తాపత్రయంలో శక్తికి మించిన ప్రయత్నం చేసి ముందుకు దూసుకుపోయాడు. శక్తికి మించి ప్రయత్నించడమే పెద్ద తప్పు అయింది. బాగా అలసిపోయి నీళ్లు తాగేశాడు. ఇక ఏమాత్రం ముందు కు సాగలేని స్థితిలో మునకలు వేయసాగాడు. అతడు మునిగిపోయి చనిపోయేందుకు ఎక్కువ వ్యవధి లేదు.

వీక్షకులలో ఆందోళన మొదలైంది. ‘అయ్యో, అయ్యో’ అంటూ కేకలు వేశారు. కాస్త వెనక వస్తున్న విమలుడనే పోటీదారుడు సురేంద్రుడి పరిస్థితిని అర్ధం చేసుకున్నాడు. మరేమీ అలోచించ కుండా, వ్యవధి ఇవ్వకుండా అతడిని తన వీపు మీదకి లాక్కున్నాడు. సురేంద్రను వీపు మీదా మోస్తూ, యధావిధిగా పోటీని కొనసాగించాడు.
వీపున బరువు ఉన్నందువల్ల అతడి వేగం క్షీణించింది. అది అవకాశంగా తీసుకొని మూడోస్థానంలో వస్తున్న పోటీదారుడు విశ్వమూర్తి విమలుడిని దాటుకొని ముందుకు దూసుకుపోయాడు. విమలుడు ఎంత ప్రయత్నించినా విశ్వమూర్తిని అధిగమించలేక పోయాడు. మొదటగా జొన్నగిరి గట్టుకు చేరిన విశ్వమూర్తిని విజయం వరించింది. కొంతమంది ప్రజలు విమలుడిని విజేతగా ప్రకటించాలని నినాదాలు చేశారు.

సాయంకాలం సభఏర్పాటు చేశారు. ఆ సభలో రంగరాయుడు విజేతను ప్రకటించనున్నాడు. ఆ సభకు భారీగా జనం హాజరై విజేత ఎవరో తెలుసుకోవాలన్న ఆతురతలో ఉన్నారు. రంగరాయుడు సభను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘ఎటువంటి ఆటంకం లేకుండా పోటీలు విజయవంతమైనందుకు ఆనందిస్తున్నాను. పోటీల నిబంధన ప్రకారం గమ్యాన్ని ముందుగా చేరుకున్న విశ్వమూర్తిని విజేతగా ప్రకటిస్తున్నాను’ అన్నాడు.
రంగరాయుడు. విశ్వమూర్తి తరఫు వారి చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు విశ్వమూర్తికి లక్ష రూపా యల భారీ బహుమతి ఇవ్వబడింది. విమలుడిని అభిమానించేవారు నిరుత్సాహపడ్డారు. ఆ తర్వాత రంగరాయుడు తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ, ‘ఈ సభ ఇంతటితో అయిపోయిందని అనుకోకండి.

ఈ పోటీలలో మరొక విజేత ఉన్నాడు. అతడే విమలుడు. ఒక వ్యక్తి నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయేస్థితిలో ఉంటే, తన గెలుపు గురించి పట్టిం చుకోకుండా, పోటీదారుడిని రక్షించి మానవత్వాన్ని చాటుకున్నాడు విమలుడు. అతనిది అసాధారణ విజయం.
అతడికి బహుమతిగా నా కుమార్తె ఆనంది ని ఇచ్చి వివాహం జరిపించదలుచుకున్నాను. వారిద్దరి ఆమోదం ఈ సభ మొదలు కావడానికి ముందే తెలుసుకున్నాను’ అని రంగరాయుడు ప్రకటించగానే ఆ ప్రదేశమంతా హర్షద్వానాలతో నిండిపోయింది. ఆ తరువాత అంతవరకు తెరవెనుక నున్న రంగరాయుడి కుమార్తె ఆనందిని పూలమాలతో వెలుపలికి వచ్చింది. పూలమాలతో విమలుడిని వరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: