చర్ల: ఇటీవల మారేడుమిల్లి అటవీప్రాంత పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్లపై (Encounter) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, మీడియా ప్రతినిధి వికల్ప్ పేరిట ఒక సంచలన లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో, మావోయిస్టు (Maoist) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, పీఎల్జీఏ మొదటి బెటాలియన్ కమాండర్ మడివి హిడ్మాతో పాటు మరో ఐదుగురు, మరియు ఏవోబీ (AOB) స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు టెక్ శంకర్ ల మరణాలు ముమ్మాటికీ హత్యలేనని వికల్ప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వికల్ప్ లేఖ ప్రకారం, ఈ రెండు ఎన్‌కౌంటర్లలో మొత్తం 13 మందిని ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపించారు. అంతేకాకుండా, మరో 50 మందిని అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు.

ఎన్‌కౌంటర్లకు దళం నుండి పారిపోయిన కోసాల్ సభ్యుడే కారణం
ఈ రెండు బూటకపు ఎన్‌కౌంటర్లకు విజయవాడకు (Vijayawada) చెందిన కలప వ్యాపారి వద్దకు దళం నుండి పారిపోయిన కోసాల్ అనే సభ్యుడు ఇచ్చిన సమాచారమే కారణమని మావోయిస్టులు లేఖలో తెలిపారు.
ఈ రెండు ఎన్‌కౌంటర్లపై వెంటనే న్యాయవిచారణ చేపట్టాలని, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పలు దఫాలుగా జరిగిన హత్యలపై కూడా వెంటనే న్యాయవిచారణ జరిపించాలని కోరారు.
ప్రజా ఉద్యమాలకు పిలుపు, న్యాయ సాయం కోసం విజ్ఞప్తి
అదేవిధంగా, ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వెంటనే ఆపాలని వికల్ప్ డిమాండ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
అరెస్ట్ అయిన 50 మంది మావోయిస్టులకు న్యాయ సాయం అందించాలని, వారి విడుదలకు కృషి చేయాలని ప్రజాపక్ష న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: