ఆరోజు ఆనందపురం ప్రజల ఆనందానికి అవధులు లేవు, కారణం ప్రవచనాలు చెప్పడంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన ప్రముఖ గురువు వారి ఊరికి వచ్చారు. గురువుకు పాదాభివందనాలు చేయడానికి, ఫోటోలు దిగడానికి ప్రజలు ఎగబడ్డారు. “ఆగండి. గురువుగారు మీతో మాట్లాడే ఏర్పాటు మేము చేస్తాము” అని ప్రజలకు అడ్డుకట్టగా నిలిచారు. నిర్వాహకులు. గురువును దగ్గరగా చూసి మాట్లాడాలని అనేకమంది పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు. వారిని గురువు దరిదాపుల్లోకి కూడా వెళ్ళకుండా కంచెలా కొందరు నిలబడ్డారు.

స్వర్ణకంకణాలు, గండపెండేరాలు, శాలువలు కలిగిన ధనవంతులు మాత్రమే గురువు వద్దకు చేరుకుని సత్కరించుకుంటున్నారు. గురువు కూడా ధనవంతుల మైకంలో పడిపోయాడు. పేదలతో ఒక్కమాట మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. కొండంత అభిమానాన్ని గుండెల్లో దాచుకుని గురువు వద్దకు వచ్చిన పేదవారిని ఎవరూ పట్టించుకోలేదు. ఇంతలో గురువు వేదికపై నుండి మెట్లు దిగుతూ కాలుజారి క్రింద పడ్డాడు. ఆయన తలకు బలమైన గాయమైంది. రక్తం విపరీతంగా కారుతుంది. అది మారుమూల ఉన్న వల్లెటూరు కావడం చేత సరైన వైద్యశాల లేదు.

ఈ దృశ్యాన్ని చూసి ధనవంతులంతా భయపడిపోయారు. ఈ పరిస్థితుల్లో గురువుకు ప్రాణాపాయం కలిగితే తమ మెడకు లేనిపోని -సమస్యలు చుట్టుకుంటాయని ధనవంతులంతా ఆ ప్రాంగణం విడిచి వెళ్ళిపోయారు. గురువును అభిమానించే పేదలంతా అక్కడికి వచ్చారు. వారికి ప్రక్కనే ఒక నవారు మంచం కనిపించింది. గాయాలపాలైన గురువును పేదలంతా ఆ నవారు మంచంపై పడుకోబెట్టి మోసుకుంటూ సమీపాని వెళ్ళారు. వైద్యానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందని వైద్యుడు చెప్పాడు. గురువును అభిమానించే పేదలంతా అప్పటికప్పుడు తమ వేద నున్న చిన్నా చితకా ఆభరణాలను అమ్మి ఆ డబ్బుతో గురువు వైద్యానికి కావలసిన మందులను కొని తెచ్చారు.

కొందరు పేదలు రక్తదానం చేశారు. వైద్యులు ఎంతో శ్రమపడి గురువుకు వైద్య సేవలు అందించి బ్రతికించారు. మూడురోజుల తరువాత గురువు కళ్ళు తెరిచాడు. ఆయన కళ్ళ ఎదుట ఆనందపురం గ్రామ బీదప్రజలు కనిపించారు. గురువుకు విషయం అర్థమైంది. పేదల మానవత్వ, అభిమానం ముందు గురువు ప్రవచనాలు వెలవెలబోయాయి. గురువు కనులకు కప్పిన పొరలు తొలగిపోయాయి. ఆరోజు నుండి ఏ పేదవాడు తన అభిమానిని అని వచ్చినా గురువు తన గుండెలకు హత్తుకుని స్నేహపూర్వకంగా మాట్లాడటం మొదలు పెట్టాడు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: