Putin Modi meeting : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల అధికారిక పర్యటనకు భారత్‌కు రానున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించడంతో పాటు, భారత్–రష్యా వార్షిక సదస్సులో కూడా పాల్గొననున్నారు. ఈ భేటీపై అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో విశేష ఆసక్తి నెలకొంది.
ఈ పర్యటన సందర్భంగా ఢిల్లీ, మాస్కో మధ్య పలు కీలక ఒప్పందాలు కుదరనున్నట్లు అంచనా వేస్తున్నారు. అమెరికా ఒత్తిడితో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించాలని ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా నేతృత్వంలో రష్యా, ఉక్రెయిన్‌తో జరుగుతున్న చర్చలు కూడా ఈ నేపథ్యంలో కీలకంగా మారాయి.
భారత్–రష్యా సంబంధాలు దశాబ్దాలుగా బలమైనవే. పుతిన్, (Putin Modi meeting) మోదీ మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహ సంబంధాలు కూడా ఈ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తున్నాయి. రెండు దేశాలకు ఒకరిపై ఒకరికి ఎందుకు అవసరం ఉందో, ఈ సమావేశంలో ఏ అంశాలు కీలకమవుతాయో విశ్లేషకులు పరిశీలిస్తున్నారు.
చమురు, వాణిజ్యం, వ్యూహాత్మక ప్రయోజనాలు
భారత్ జనాభా సుమారు 150 కోట్లకు చేరువగా ఉండటం, 8 శాతానికి పైగా ఆర్థిక వృద్ధి కొనసాగుతుండటంతో ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఇది రష్యాకు ఎంతో ఆకర్షణీయమైన మార్కెట్‌గా మారింది, ముఖ్యంగా చమురు, సహజ వనరుల విషయంలో.
Read also: EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం
ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుడైన భారత్, భారీగా రష్యా చమూరును కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందుగా భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 2.5 శాతం మాత్రమే. అయితే యుద్ధానంతరం యూరోప్ మార్కెట్ చేరుబాటులో ఇబ్బందులు తలెత్తడంతో, తగ్గింపు ధరల కారణంగా ఈ వాటా 35 శాతానికి పెరిగింది.
ఈ పరిణామాలతో భారత్ లాభపడ్డప్పటికీ, అమెరికా అసంతృప్తిని వ్యక్తం చేసింది. అక్టోబరులో ట్రంప్ ప్రభుత్వం భారత ఎగుమతులపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధించింది. రష్యా యుద్ధ ఖజానాకు నిధులు అందిస్తున్నామన్న ఆరోపణలతో ఈ చర్య చేపట్టింది. దీని తరువాత భారత్ నుంచి రష్యా చమురు ఆర్డర్లు కొంతమేర తగ్గినట్లు సమాచారం. అయినా భారత్ రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగించాలని పుతిన్ కోరుతున్నారు.
రక్షణ రంగం, కార్మిక అవసరాలు
సోవియట్ కాలం నుంచే భారత్‌కు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారుగా ఉంది. ఈ పర్యటనకు ముందు, అధునాతన యుద్ధ విమానాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను భారత్ కొనుగోలు చేయవచ్చన్న వార్తలు వచ్చాయి. ఇది రక్షణ సహకారం మరింత బలపడే అవకాశాలను చూపిస్తోంది.
కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న రష్యా, నైపుణ్యం గల భారతీయ కార్మికులను కూడా ముఖ్య వనరుగా చూస్తోంది.
భౌగోళిక రాజకీయాల కోణం
యుద్ధంపై పశ్చిమ దేశాలు రష్యాను ఒంటరిని చేయాలన్న ప్రయత్నాలు విఫలమయ్యాయని ప్రపంచానికి చూపించడమే క్రెమ్లిన్ లక్ష్యంగా కనిపిస్తోంది. భారత్‌కి పుతిన్ పర్యటన ఈ సందేశంలో భాగమే.
ఇదే విధంగా మూడునెలల క్రితం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావడం, ఆ సందర్భంగా మోదీతో భేటీ కావడం కూడా గమనార్హం. ఈ ముగ్గురు నేతల సంయుక్త చిత్రాలు ‘మల్టీ–పోలార్ వరల్డ్’ సిద్ధాంతానికి మద్దతుగా ప్రపంచానికి సంకేతం ఇచ్చాయని విశ్లేషకులు అంటున్నారు.
చైనాతో ‘నో లిమిట్స్ పార్ట్‌నర్‌షిప్’ అని చెప్పుకునే రష్యా, భారత్‌తో ‘ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం’ ఉందని ఘనంగా చెబుతోంది. ఇదంతా యూరోపియన్ యూనియన్‌తో రష్యా సంబంధాలు క్షీణించిన పరిస్థితిలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ వారం మొత్తం భారత్–రష్యా స్నేహం, వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక సహకారం గురించి ప్రస్తావనలు ఎక్కువగా వినిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/