Cyclone Ditwah : సైక్లోన్ దిత్వా విధ్వంసంతో శ్రీలంక ఇప్పటికీ తీవ్ర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభ సమయంలో భారత్, పాకిస్తాన్ సహా పలు దేశాలు అందిస్తున్న సహాయంపై శ్రీలంక మాజీ క్రికెటర్ ఏంజెలో మ్యాథ్యూస్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన ప్రాంతాల్లో ప్రాణాలను కాపాడేందుకు సైన్యాలు చేస్తున్న రక్షణ చర్యలు ప్రశంసనీయమని ఆయన అన్నారు.
ఎక్స్ (X) వేదికగా పోస్టు చేసిన మ్యాథ్యూస్,
“ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాధితులను కాపాడుతున్న మా సాయుధ దళాలకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే శ్రీలంకలో ప్రాణాలు కాపాడేందుకు భారత, పాకిస్తాన్ సైన్యాలు సహా ఇతర దేశాల బలగాలు చేస్తున్న సేవలు అమూల్యమైనవి. ప్రతి శ్రీలంక పౌరుడు వీరి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాడు” అని వ్యాఖ్యానించారు.
Read also:Grama Panchayat Elections : పంచాయతీ ఎన్నికల్లో వాళ్లకే ఓటేయండి – రేవంత్
సైక్లోన్ దిత్వా కారణంగా శ్రీలంకలో విస్తృత వరదలు, ప్రాణనష్టాలు, రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడ్డాయి. భారత ప్రభుత్వం నవంబర్ 28న “ఆపరేషన్ సాగర్ బంధు” ప్రారంభించి సముద్ర, గగన మార్గాల ద్వారా సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు సుమారు 53 టన్నుల ఉపశమన సామగ్రిని భారత్ పంపించింది. అలాగే వరదల్లో చిక్కుకున్న 2,000 మందికిపైగా భారతీయులను స్వదేశానికి తరలించింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించిన ప్రకారం, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు (Cyclone Ditwah) తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఐఎఎఫ్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్లు, నౌకాదళానికి సంబంధించిన చెతక్ హెలికాప్టర్ల ద్వారా గర్భిణీలు, శిశువులు, గాయపడిన వారితో పాటు పలువురు విదేశీయులను రక్షించారు.
ఇప్పటివరకు శ్రీలంకలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 334 మంది మృతి చెందగా, 370 మంది అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏంజెలో మ్యాథ్యూస్ ప్రస్తుతం సహాయక చర్యల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/