నక్సల్స్ ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్లో మరణించడంపై నిరసన వ్యక్తం చేస్తూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నవంబర్ 23న భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ ఎన్కౌంటర్ నవంబర్ 18వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, ఏపీ-ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో హిడ్మా, అతడి భార్య రాజక్కతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బెటాలియన్ నెం. 1 అధిపతిగా, సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. పలు పెద్ద దాడులకు అతడే సూత్రధారి అని భద్రతా దళాలు పేర్కొంటున్నాయి.
Latest News: KTR: CM అబద్ధాలని CAG బట్టబయలు?
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాత్రం హిడ్మా ఎన్కౌంటర్ను బూటకపు కాల్పుల కథగా ఆరోపిస్తోంది. అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం విజయవాడకు వచ్చినప్పుడు పోలీసులు అతడిని, అతని సహచరులను నవంబర్ 15న నిరాయుధులుగా అదుపులోకి తీసుకుని, నవంబర్ 18న మారేడుమిల్లి అడవుల్లో కాల్చి చంపారని మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యను కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) చేసిందని వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా, హిడ్మా హత్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో, భద్రతా దళాలు మరియు మావోయిస్టుల వాదనలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి.

మావోయిస్టులు భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ముఖ్యంగా మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (AOB) ప్రాంతంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. విశాఖపట్నం నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వరకు నడిచే బస్సు సర్వీసులను రద్దు చేశారు. ప్రజా ప్రతినిధులు ఏజెన్సీ ప్రాంతాలను వదిలి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. అయితే, బంద్ రోజు ఆదివారం కావడంతో, మైదాన ప్రాంతాలలో మరియు పట్టణాలలో బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజల ప్రయాణాలపై మాత్రం ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/