దిల్లీ నగరానికి పేలుళ్లు కొత్తవి కావు. గతంలోనూ ఇలాంటి దారుణ ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. 2005 అక్టోబర్ 9న, దీపావళి పండుగ ముగిసిన రెండు రోజులకే రాజధాని రక్తసిక్తమైంది. సాయంత్రం 5.38 గంటల నుండి 6.05 గంటల మధ్య కేవలం 27 నిమిషాల వ్యవధిలో వరుసగా పేలుళ్లు సంభవించాయి. సరోజిని నగర్, పహార్గంజ్, గోవింద్‌పురి వంటి రద్దీ ప్రాంతాల్లో ఈ పేలుళ్లు చోటుచేసుకోవడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆ ఘటనలో 67 మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. ఆ సమయంలో మార్కెట్లు పండుగ కొనుగోళ్లతో కిటకిటలాడుతుండటంతో ప్రాణ నష్టం విపరీతంగా జరిగింది. ఈ దాడిని లష్కర్-ఇ-తయిబా ఉగ్రవాద సంస్థ చేసినట్లు తరువాత దర్యాప్తులో తేలింది.
Latest News: Moosi River: హైదరాబాద్‌లో ₹304 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి
2008 సెప్టెంబర్ 13న దిల్లీ మరోసారి బాంబు దాడుల తాలూకు భయానక దృశ్యాన్ని చూసింది. సాయంత్రం 6.27 గంటలకు పోలీసులకు ఓ ఇమెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌లో పేలుళ్లు జరగబోతున్నాయని హెచ్చరిక ఇచ్చినప్పటికీ, అధికారులు స్పందించేలోపు నగరమంతా కుదిపేసేలా తొమ్మిది వరుస పేలుళ్లు జరిగాయి. కనాట్ ప్లేస్, గ్రేటర్ కైలాష్, గోకుల్‌పురి, బరఖంబా రోడ్ వంటి రద్దీ ప్రాంతాలు ఆ దాడికి వేదికయ్యాయి. ఈ ఘటనలో 25 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. దిల్లీ వాసుల హృదయాల్లో భయం మళ్లీ ముసురుకుంది. ఆ దాడికి ఇండియన్ ముజాహిద్దీన్ బాధ్యత వహించినట్లు ప్రకటించింది.

ఇక నేడు ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన ఆ భయానక జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసింది. ఈసారి కూడా సాయంత్రం వేళలోనే భారీ శబ్దంతో పేలుడు సంభవించడం ఆ రెండు ఘటనల సమయాన్నే తలపించింది. ఇప్పటివరకు లభించిన సమాచారం ప్రకారం, 13 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు ఈ ఘటనను సాధారణ ప్రమాదంగా కాకుండా పూర్వ ప్రణాళికతో చేసిన ఉగ్రదాడిగా భావిస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా దిల్లీ నగరం ఉగ్రవాదుల లక్ష్యంగా మారడం దేశ భద్రతా వ్యవస్థలకు పెద్ద సవాలుగా నిలుస్తోంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/