తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని కుదిపేసిన మాగంటి గోపీనాథ్ మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ మృతిపై అనేక అనుమానాలు, రాజకీయ ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, ఈ అంశాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశం తనకు లేదని రేవంత్ స్పష్టం చేశారు. “మాగంటి గోపీనాథ్ గారు ఓ ప్రజాప్రతినిధి మాత్రమే కాదు, మంచి మనిషి. ఆయన మరణం దురదృష్టకరం. కానీ ఇలాంటి విషయంలో రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడం సరికాదు” అని సీఎం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తుందని, ఎవరికైనా అనుమానం ఉంటే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు.
Breaking News – KTR Tweet: కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
అయితే ఈ ఘటన చుట్టూ గోపీనాథ్ కుటుంబ సభ్యుల నుండి వస్తున్న ఆరోపణలు మాత్రం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. గోపీనాథ్ తల్లి మాట్లాడుతూ..“నా కొడుకు ముందే చనిపోయినా, కేటీఆర్ వచ్చే వరకు మరణాన్ని ధృవీకరించలేదు. నా కొడుకును చూడకుండా అడ్డుకున్న వారు ఎవరు?” అని ప్రశ్నించారు. అంతేకాకుండా, గోపీనాథ్ వేలిముద్రలు కూడా తీసుకున్నారనే సీరియస్ ఆరోపణలు చేశారు. ఈ అంశాలు బయటకు రావడంతో ప్రజల్లో అనుమానాలు మరింతగా పెరిగాయి. అయితే, సీఎం రేవంత్ స్పష్టంగా చెబుతూ .. “కుటుంబ సభ్యులు అధికారిక ఫిర్యాదు చేస్తే, పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారు. చట్టం తన పని తాను చేసుకుంటుంది” అన్నారు.

ఇదిలా ఉండగా, గోపీనాథ్ మరణం చుట్టూ రాజకీయ వర్గాలు, మీడియా వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. ఒకవైపు BRS నేతలు, ముఖ్యంగా కేటీఆర్ పట్ల ఆరోపణలు వినిపిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం విచారణపై నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందని చెప్పుకుంటోంది. రేవంత్ వ్యాఖ్యలతో ప్రభుత్వం ఈ కేసును రాజకీయ కోణం కాకుండా న్యాయపరమైన దిశలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, మాగంటి గోపీనాథ్ మరణం తెలంగాణ రాజకీయాల్లో మరో సున్నితమైన చర్చగా మారి, రాబోయే రోజుల్లో మరిన్ని వెల్లడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/