శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. నిన్న జరిగిన ఈ దారుణంలో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే వరకు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఆలయం చుట్టుపక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి, పరిస్థితి సాధారణం అయ్యే వరకు ఎవరికీ అనుమతి ఇవ్వరని అధికారులు స్పష్టం చేశారు.
Breaking News – Tragedy in Kenya: కెన్యా లో కొండచరియలు విరిగిపడి 21మంది మృతి
ఇక తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆలయ నిర్వాహకుడు హరిముకుంద పండాను గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయన నివాసం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ప్రాథమిక విచారణలో భక్తుల నియంత్రణలో లోపాలు, భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యం ఉన్నట్లు తేలినట్లు సమాచారం. పండుగ సందర్భంగా వేలాది మంది భక్తులు ఒకేసారి ఆలయంలోకి ప్రవేశించడం వల్ల గందరగోళం ఏర్పడిందని, ఇది తొక్కిసలాటకు దారితీసిందని అధికారులు పేర్కొంటున్నారు. భక్తుల ప్రాణ నష్టం జరగడం పట్ల జిల్లా పరిపాలన తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మరణించిన వారి కుటుంబాలకు తక్షణ సహాయం అందించే ప్రక్రియను ప్రారంభించింది.

దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఘటన జరిగిన విధానం, భద్రతా లోపాలు, నిర్వాహకుల నిర్లక్ష్యం తదితర అంశాలపై సమగ్ర పరిశీలన జరపనుంది. రెండు రోజుల్లోపు ఈ కమిటీ ప్రభుత్వంకు నివేదిక అందజేయనుంది. నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు, కాశీబుగ్గ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. మరణించిన భక్తుల కుటుంబాలను అధికారులు పరామర్శిస్తూ, తగిన పరిహారం అందించేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/