ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న “ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచింది కేంద్రం” అనే వార్తకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వార్తను పూర్తిగా తప్పుడు అని ఖండించింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచే కొత్త పాలసీని కేంద్రం ప్రవేశపెట్టలేదని, అలాంటి ప్రతిపాదన కూడా ప్రస్తుతానికి పరిశీలనలో లేదని PIB పేర్కొంది. సోషల్ మీడియాలో ఎవరైనా ఈ రకమైన అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తే జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు అధికారిక వనరుల ద్వారానే వివరాలను తెలుసుకోవాలని ఫ్యాక్ట్ చెక్ విభాగం సూచించింది.
Latest News: Shamshabad: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
ఇప్పటికే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గతంలో ఇదే విషయంపై స్పందిస్తూ, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు మించి పెంచే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. ఆయన తెలిపినట్లుగా, పదవీ విరమణ వయసును నిర్ణయించడం అనేది క్రమబద్ధమైన ప్రక్రియ. సిబ్బంది పనితీరు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల రిటైర్మెంట్ వయసు పెంపు వంటి నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా సమీక్ష జరిపి, వివిధ విభాగాల నుంచి నివేదికలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలుగానే కొనసాగుతోంది. వైద్య విద్యా రంగం లేదా కొన్ని ప్రత్యేక విభాగాల్లో మాత్రమే 62 లేదా 65 ఏళ్ల వరకు పొడిగింపు ఉన్నా, సాధారణ సిబ్బందికి ఇది వర్తించదు. కేంద్రం ఏదైనా విధాన మార్పు చేసినప్పుడు అధికారిక గెజిట్ లేదా ప్రెస్ రీలీజ్ ద్వారా మాత్రమే ప్రకటిస్తుందని, అందువల్ల సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు నిర్ధారణ లేని సమాచారాన్ని షేర్ చేయకూడదని ప్రభుత్వం మరోసారి సూచించింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/