తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మరలా రాజకీయంగా వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 42 శాతం రిజర్వేషన్ జి.ఓ.పై హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ నేపథ్యంలో, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రజలకు నిజమైన లబ్ధి చేకూర్చే ఉద్దేశం కాంగ్రెస్కు లేదు. రాజకీయ లాభాల కోసం అసంబద్ధ బిల్లులు, జి.ఓలు తెచ్చి ప్రజలతో డ్రామా చేస్తోంది” అని ఆరోపించారు. బీసీ వర్గాల ఆత్మాభిమానాన్ని కేవలం ఓటు బ్యాంక్‌గా ఉపయోగించుకునే ప్రయత్నమే ఇది అని ఆయన పేర్కొన్నారు.
Telangana HC stays GO on 42% BC Quota : కాంగ్రెస్ క్యాడర్లో నిరాశ!
ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. “ప్రభుత్వానికి నిజంగా ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం ఉంటే, చట్టపరంగా సరైన మార్గంలో ముందుకు వెళ్లేది. కానీ హైకోర్టు స్పష్టంగా పరిమితులు ఉన్నాయని చెబుతున్నప్పుడు, వీరు మాత్రం బీసీ వర్గాలను తప్పుదారి పట్టిస్తున్నారు” అని వారు విమర్శించారు. రిజర్వేషన్ పరిమితి 50 శాతం అనే నియమాన్ని కాంగ్రెస్ హయాంలోనే కేంద్రం తీసుకువచ్చిందని, ఇప్పుడు అదే పార్టీ ఆ పరిమితిని పెంచుతామని చెబితే అది సీఎం అవగాహన లేమిని చూపిస్తుందని వ్యాఖ్యానించారు.

బీజేపీ నేతలు ఈ అంశాన్ని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌పై ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ఒకవైపు బీసీ హక్కుల కోసం కట్టుబడి ఉన్నామంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తుండగా, మరోవైపు బీజేపీ మాత్రం దీన్ని “ప్రమాదకరమైన మోసం”గా చిత్రీకరిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, హైకోర్టు తీర్పు తర్వాత రిజర్వేషన్ వ్యవహారంలో రాజకీయ వాదోపవాదాలు మరింత ముదురుతాయని భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు సెంటర్ స్టేజ్‌లో నిలిచింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/