ఆఫ్రికా ఖండంలోని చిన్న దేశం ఎస్వాటినీ (మునుపటి స్వాజిలాండ్) రాజు మ్స్‌వాటి–III (Mswati III) మరోసారి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచారు. 1986లో 18ఏళ్ల వయసులో సింహాసనం అధిష్టించిన ఆయన, ప్రస్తుతం ఆ దేశపు నిరంతర పాలకుడిగా కొనసాగుతున్నారు. తాజాగా అబుదాబి పర్యటనలో 15 మంది భార్యలు, 36 మంది పిల్లలు, 100 మందికి పైగా సిబ్బందితో కలిసి వెళ్లడం సోషల్ మీడియా, వార్తా మాధ్యమాల్లో పెద్ద చర్చగా మారింది. ఆయన విలాసవంతమైన జీవనశైలిని చూపించే పాత వీడియోలు కూడా మళ్లీ వైరల్ అవుతున్నాయి.
Latest News: MGR: తమిళనాడులో ఎంజీఆర్ విగ్రహం ధ్వంసం
ఎస్వాటినీ ఆర్థికంగా వెనుకబడి ఉన్న దేశం. అక్కడి జనాభాలో 60%కిపైగా మంది పేదరిక రేఖ (BPL) కింద జీవిస్తుండగా, ఆరోగ్య, విద్య, ఉపాధి రంగాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే రాజు మ్స్‌వాటి–III మాత్రం 1 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా వ్యక్తిగత సంపదను కలిగి ఉన్నారని అంతర్జాతీయ ఆర్థిక నివేదికలు చెబుతున్నాయి. ఆయన భార్యలు, పిల్లలు, కుటుంబసభ్యులు ప్రైవేట్ జెట్లలో ప్రయాణించడం, లగ్జరీ హోటళ్లలో తిష్టవేయడం, విలాసవంతమైన జీవన శైలిని కొనసాగించడం స్థానిక ప్రజల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. పేదరికం మధ్య రాజవంశం చేసిన ఈ ఖర్చు దేశీయ, అంతర్జాతీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలకు గురవుతోంది.

మ్స్‌వాటి–III తండ్రి సోబుజా–IIకీ (Sobhuza II) అసాధారణమైన వివాహజీవితం ఉండేది. ఆయనకు 125 మంది భార్యలు ఉండగా, వందలాది సంతానం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ వంశపారంపర్యపు బహుభార్యత్వ సంస్కృతిని మ్స్‌వాటి–III కూడా కొనసాగిస్తున్నారని విమర్శకులు అంటున్నారు. అయితే ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం, రాజకుటుంబం అధిక వ్యయాలు, దేశ వనరుల దుర్వినియోగం వంటి అంశాలు ఆ దేశ ప్రజాస్వామ్య పోరాటాలకూ కారణమవుతున్నాయి. దీంతో ఎస్వాటినీ భవిష్యత్తులో రాజ్యవ్యవస్థ సవాళ్లు, ప్రజల అసంతృప్తి, అంతర్జాతీయ ఒత్తిడి మధ్య ఎటు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/