అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన అతిపెద్ద విదేశీ బ్యాంకులలో HSBC ఒకటి. దేశవ్యాప్తంగా తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరం విశాఖపట్నంలో (వైజాగ్) కొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ విస్తరణకు అనుమతి ఇచ్చిందని HSBC వెల్లడించింది. దీని ద్వారా విశాఖ వంటి ప్రధాన వ్యాపార, పారిశ్రామిక కేంద్రాల్లో అంతర్జాతీయ స్థాయి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
TCS Layoffs : TCS లేఆఫ్స్.. పరిహారంగా రెండేళ్ల జీతం!
HSBC బ్యాంక్ భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి కట్టుదిట్టమైన ప్రణాళికను సిద్ధం చేసింది. దేశంలోని 20 ప్రాంతాల్లో కొత్త శాఖలను ప్రారంభించేందుకు RBI నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, ఈ ప్రక్రియలో విశాఖపట్నం కూడా ఉన్నట్లు బ్యాంక్ ప్రకటించింది. సరైన భవనం మరియు సౌకర్యాలు సిద్ధమైన వెంటనే విశాఖలో బ్రాంచ్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తామని HSBC ఇండియా ఇంటర్నేషనల్ అండ్ ప్రీమియం బ్యాంకింగ్ విభాగం హెడ్ సందీప్ బాత్రా తెలిపారు. ఈ 20 కొత్త శాఖలు ప్రారంభమైతే HSBC బ్యాంక్‌కి దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచుల సంఖ్య 46కు చేరుతుంది.

విశాఖపట్నం ఇప్పటికే తీరప్రాంత వ్యాపార, రవాణా, పారిశ్రామిక కార్యకలాపాల కేంద్రంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో HSBC వంటి అంతర్జాతీయ బ్యాంకు బ్రాంచ్ ఏర్పాటుతో ప్రాంతీయ వ్యాపారులు, పరిశ్రమలు మరియు అంతర్జాతీయ లావాదేవీలు చేసే వ్యక్తులకు అధునాతన బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్యాల లావాదేవీలు, కార్పొరేట్ బ్యాంకింగ్, ప్రీమియం బ్యాంకింగ్ వంటి సేవలు మరింత సులభతరం కావడం వల్ల విశాఖ ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహం లభించనుంది.