ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు (Maoists ) ఉద్యమంపై భద్రతా దళాలు సాధించిన మరో కీలక విజయంగా 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 23 మంది మహిళలు ఉండటం విశేషం. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం మావోయిస్టు ప్రభావానికి కేంద్రంగా ఉంది. కానీ ఇటీవల భద్రతా దళాలు, రాష్ట్ర ప్రభుత్వం కలసి చేపట్టిన కఠిన చర్యలు, అవగాహన కార్యక్రమాలు, పునరావాస పథకాలు మావోయిస్టుల మనోభావాల్లో మార్పు తీసుకొచ్చాయి. దాంతో ఈ భారీ స్థాయి లొంగుబాటు చోటుచేసుకోవడం, నక్సలిజం నిర్మూలనలో ఒక మైలురాయిగా భావిస్తున్నారు.
Rains : ఒడిశాలో వర్షాలు.. శ్రీకాకుళానికి వరద ముప్పు
లొంగిపోయిన 103 మంది మావోయిస్టుల్లో 49 మందిపై రూ.1.06 కోట్లకు పైగా రివార్డు ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి, భద్రతా దళాలకు పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. లొంగుబాటుతోపాటు పునరావాసం, ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ రూ. 50,000 చొప్పున ప్రోత్సాహక నగదు అందించింది. ఆర్థిక సాయం మాత్రమే కాకుండా వృత్తి శిక్షణ, నివాసం, విద్య వంటి సౌకర్యాలు కూడా ఈ పథకంలో భాగంగా అందించబడతాయని అధికారులు తెలిపారు. దీంతో లొంగిపోయిన మావోయిస్టులు భవిష్యత్తులో శాంతియుత జీవితం సాగించేందుకు అవకాశం దొరుకుతుంది.

ఇక కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31లోపు నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ‘ఆపరేషన్ కగార్’ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా సరిహద్దు అడవులలో భద్రతా దళాలు మోహరింపులు పెంచి, మావోయిస్టులకు ఆర్థిక, లాజిస్టిక్ మద్దతును అడ్డుకుంటున్నాయి. అదే సమయంలో పునరావాసం, సామాజిక న్యాయం, అభివృద్ధి అనే మూడు సూత్రాలపై రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేయడం వల్లే బీజాపూర్‌లోని ఈ లొంగుబాటు సాధ్యమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామం నక్సలిజం సమస్యపై ప్రభుత్వ దృక్పథం ఫలితాలిస్తున్నదనే సంకేతాన్ని ఇస్తోంది.