విజయవాడ: రాష్ట్రంలో మొత్తం 2,524 విగ్రహాలు అనధికారంగా ఉన్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy)తెలిపారు. 2019లో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఇప్పటివరకు కొత్త విగ్రహాలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు ముందు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని, లేనిపక్షంలో వాటిని తొలగించే చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను గుర్తించి కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు.

విగ్రహాల కూడళ్లు అభివృద్ధి పేరిట కోట్లాది రూపాయలు వృథా
ప్రజల భావోద్వేగాలు, చట్టపరమైన నిబంధనలు రెండింటినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో అనధికారికంగా విగ్రహాల ఏర్పాటు అంశం శాసన మండలిలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్న టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి(Bhumireddy Ramagopal Reddy), పులివెందులలో ప్రజా నిధులను దుర్వినియోగం చేసి అనధికారికంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ విగ్రహాల కూడళ్లు అభివృద్ధి పేరిట కోట్లాది రూపాయలు వృథా చేశారని మండిపడ్డారు. అదేవిధంగా టిడిపి ఎమ్మెల్సీలు బి. తిరుమలనాయుడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా అనధికార విగ్రహాలపై ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయడంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. టిడిపి సభ్యుల వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. దీనికి నిరసనగా ఆయన సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. బొత్స తీరుపై రెడ్డి ఎమ్మెల్సీలు స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. టీడీపీ సభ్యుల విమర్శలు, బొత్స సత్యనారాయణ ప్రతిస్పందనతో సభలో ఉద్రిక్తత నెలకొంది. విగ్రహాల ఏర్పాటు అంశం సర్వసాధారణ పరిపాలనా సమస్యగా మొదలైనా, అది క్రమంగా రాజకీయ వాదనలకు దారితీసింది. ముఖ్యంగా వైఎస్సార్ విగ్రహాల విషయంలో ప్రజా నిధుల దుర్వినియోగం ఆరోపణలు రావడం, వాటిపై వైఎస్సార్సీపీ ప్రతినిధులు అభ్యంతరం తెలపడంతో మండలిలో వాతావరణం వాడివేడిగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: