ఆంధ్రప్రదేశ్ శాసన మండలి(Legislative Council)లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపినందుకు కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రజల ఆవేశం, కృషికి అనుగుణంగా ఈ నిర్ణయం వెలువడిందని ఆయన అన్నారు. ఈ తీర్మానం ద్వారా కేంద్రానికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలిపే అవకాశం లభించిందని లోకేశ్ స్పష్టం చేశారు.
ప్రధాని, కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు
ప్రధాని నరేంద్ర మోదీ(Modi)తో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు మంత్రి కుమారస్వామిని లోకేశ్ అభినందించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా నిలబడటంతో పాటు కేంద్రం కూడా ఆ అభ్యర్థనను గౌరవించిందని ఆయన వివరించారు. ఈ తీర్మానం ప్రజల సంకల్పానికి ప్రతిబింబంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఏకగ్రీవ ఆమోదం, ప్రతిపక్షానికి కృతజ్ఞతలు
తీర్మానానికి ప్రతిపక్ష వైసీపీ కూడా మద్దతు తెలపడం విశేషంగా మారింది. దీంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు మండలి ఛైర్మన్ ప్రకటించారు. ప్రతిపక్షం సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు లోకేశ్. విశాఖ స్టీల్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుందని, భవిష్యత్తులో దీన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు.