కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ పన్ను విధానం వల్ల అటు దేశానికి, ఇటు సామాన్యులకు ఎంతో మేలు కలుగుతోంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు పన్నుల అంశాలపై సమావేశాలు నిర్వహించడం ద్వారా సంస్కరణలను తీసుకురావడం చక్కటి ఫలితాలను ఇస్తోంది. ఇటు కేంద్రానికి, అటు రాష్ట్రాలకు జీ ఎస్ టి పన్ను విధానం ఆర్థిక వెసులుబాటును కలిగిస్తోంది. ప్రస్తుతం తాజాగా మరోసారి జీ ఎస్ టి శ్లాబ్ లు మార్పు చేశారు. దీనితో 28 శాతం, 12 శాతం ఉన్న శ్లాబ్లు పూర్తిగా తొలగించారు. ఈ శ్లాబ్ లో ఉన్న వాటిని 5 శాతం, 18 శాతం ఉన్న శ్లాబ్ కు సర్దుబాటు చేశారు. అంతేకాకుండా అనేక వస్తువులు, సేవలపై పూర్తిగా పన్ను తొలగించి జీరో జీ ఎస్ టి విధానాన్ని తీసుకువచ్చారు. అదేవిధంగా లగ్జరీ, ఆరోగ్యానికి (health) హానీ కలిగించే వస్తువులు, వినోదాలపై ఏకంగా 40 శాతం ప్రత్యేక పన్ను విధానాన్ని అమలు చేస్తున్నారు.
కొత్త శ్లాబ్ విధానం అమలులోకి వస్తుంది
సరిగ్గా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం రోజున అంటే సెప్టెంబరు 22వ తేదీ నుంచి కొత్త శ్లాబ్ విధానం అమలులోకి వస్తుంది. ఇప్పటికే తగ్గించిన శ్లాబ్లతో అటు వాణిజ్య వ్యాపార వర్గాలు, ఇటు సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో ఆనందోత్సవాలు వెల్లడౌతున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్(Automobile) రంగం ఇప్పటి నుంచి తమ వాహనాల తగ్గుదల వివరాలను ప్రకటించారు. తక్కువ మొత్తంలో ఉన్న కార్లు, మోటారుబైకులు కొనుగోలు చేసే వినియోగదారులు ధరల తగ్గుదలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేన్సర్కు సంబం ధించిన ఔషదాలపై గతంలో 12 శాతం పన్ను ఉండేది. ప్రస్తుతం అది పూర్తిగా తొలగించారు. వ్యక్తిగత బీమా పాలసీలపై ఇప్పటి వరకు 18 శాతం జీఎన్జీ ఉండేది. ప్రస్తుతం జీరో స్థాయికి చేర్చారు. విద్యార్థులు ఉపయోగించే మ్యాప్లు, గ్లోబ్లు గతంలో 12 శాతం వడ్డీ ఉండేది. ప్రస్తుతం జీరోగా మార్చారు. పెన్సిళ్లు, షార్ప్ నర్స్, రబ్బర్లు, క్రేయాన్లు, నోట్ పుస్తకాలపై 5 శాతం పన్ను ఉండేది. ఇప్పుడు పూర్తిగా తొలగించారు. ఆహార పదార్థాలైన రొట్టెలు, పరోటా, చపాతీలు, పన్నీర్ వంటి వాటిపై 5 శాతం పన్నును పూర్తిగా ఎత్తివేశారు. ఇక హెయిర్ ఆయిల్, సబ్బులు, టూత్పేస్టులు, నమ్కీన్ బిస్కెట్లు, పాస్తా, కార్న్ ప్లేక్స్, తృణధాన్యాలు, వంట పాత్రలు, సైకిళ్లు, చెప్పులు, దుస్తులపై 12 నుంచి 18 శాతం వరకు జీఎస్టీని విధించేవారు. ప్రస్తుతం ఈ సరుకులకు కేవలం 5 శాతం శ్లాబ్ విధానంలోకి మార్చడంతో ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా ఆరోగ్యాన్ని పెంచే డ్రైఫ్రూట్స్, నట్స్ వంటి వాటిపై కూడా 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.

ఇక శస్త్ర చికిత్సకు ఉపయోగించే పరికరాలపై
ఇక శస్త్ర చికిత్సకు ఉపయోగించే పరికరాలపై ఉన్న 18 శాతం జీఎస్టీని ఎత్తివేసి కేవలం 5 శాతానికి తగ్గించారు. సెలూన్ సేవలు, యోగా కేంద్రాల సేవలకు కూడా 18 నుంచి 5 శాతానికి తగ్గించారు. వ్యవసాయ రంగంలోనూ అనేక వస్తువులపై జీఎస్టి శ్లాబ్లను తగ్గించారు. ఇటీవల కాలంలో మధ్య తరగతి కుటుంబీకులు సైతం కొనుగోలు చేస్తున్న ఎయిర్ కండిషన్లు, టెలివిజన్లు, ఫ్రిజ్లు, వాషింగ్ మిషన్లు, 1200 సిసి లోపు ఉన్న పెట్రోలు కార్లు, 1500 సిసి లోపు ఉన్న డీజిల్ కార్లు, మోటారుసైకిళ్లు, బస్సులు, ట్రక్కులు, ఆటోలు, అంబులెన్స్లు, సిమెంట్ తదితర వస్తువులపై 28 శాతం ఉన్న శ్లాబ్లను 18 శాతానికి తగ్గించివేశారు. దీనితో ఆయా వస్తువులు, వాహనాల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇక లగ్జరీ కార్లు, 350 సిసి సామర్థ్యం దాటి ఉన్న ద్విచక్ర వాహనాలు, ఎరేటెడ్, కార్బొనేటెడ్ పానీయాలు, పడవలు, వ్యక్తిగత విమానాలు, రివాల్వర్లు, పిస్తోళ్లు, బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్, క్యాసినోలు, ఐపిఎల్ వంటి క్రీడా కార్యక్రమాల ప్రవేశ రుసుములుపై ఏకంగా 40 శాతం ప్రత్యేక పన్ను విధానాన్ని తీసుకువచ్చారు. గతంలో వీటిపై 28 శాతం జీఎస్టి మాత్రమే ఉండేది. 40 శాతం ప్రత్యేక పన్ను విధానంలో ఉన్న వస్తువులు, సరుకులు, సేవలు గతంలో కూడా సామాన్యులకు, మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేవి కాదు. ప్రస్తుతం వాటిపై ఎక్కువ పన్ను వేయడం వల్ల సామాన్య జనాలకు పెద్దగా నష్టం కలగే అవకాశం లేదు. జీఎస్టి పన్ను విధానంలో వచ్చే ఆదాయంలో 50 శాతం కేంద్రానికి, 50 శాతం రాష్ట్రాలకు వర్తిస్తుంది. శ్లాబ్ల తగ్గింపు, జీరో పన్ను విధానం అమలు వల్ల అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో ఆర్ధిక నష్టం కలుగుతుంది. అయితే జీఎస్టీ పన్ను ఆన్లైన్ విధానంలో ఉండటం వల్ల ప్రతి క్రయ విక్రయాల లావాదేవీలు పారదర్శకంగా ఉంటాయి. వస్తువుల ధరలు తగ్గడం వల్ల డిమాండ్ పెరిగి ఆ మేరకు జీఎస్టీ ఆదాయం కూడా పెరుగుతుందని అంచనాలు వేస్తున్నారు. దీనివల్ల కేంద్రానికి, రాష్ట్రాలకు భవిష్యత్తులో మరింత ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ జీఎస్ట అమలు తరువాత ధరలు తగ్గుముఖం పట్టడం ప్రజల్లో ఆనందం కలిగిస్తోంది.
Read also: hindi.vaartha.com
Read also: