అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) తీసుకున్న H1B వీసా ఛార్జీల పెంపు నిర్ణయంపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపనుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి అమెరికాకు వలస వెళ్ళినవారి సంఖ్య గణనీయంగా ఉండటంతో, అక్కడి ఉద్యోగ అవకాశాలు నేరుగా ఇక్కడి కుటుంబాల ఆర్థిక భద్రతకు సంబంధించినవని మంత్రి గుర్తు చేశారు. వీసా ఛార్జీల పెంపుతో యువతకు అవకాశాలు తగ్గిపోవడంతో పాటు, ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా భారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

శ్రీధర్ బాబు (Sridhar Babu) వివరించిన ప్రకారం.. అమెరికాలో తెలంగాణకు చెందిన వేలాది మంది పనిచేస్తున్నారు. టీసీఎస్‌లో లక్షమంది, విప్రోలో 80 వేలమంది, ఇన్ఫోసిస్‌లో 60 వేల మంది వరకు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. వీరి ద్వారా రాష్ట్రానికి వస్తున్న విదేశీ మారకద్రవ్యాలు, కుటుంబాలకు పంపించే డబ్బు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన వివరించారు. వీసా ఛార్జీల పెంపు వల్ల ఈ ప్రవాహం దెబ్బతింటే, రాష్ట్రంలో అనేక కుటుంబాలు ఆర్థిక కష్టాల్లో పడతాయని మంత్రి హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం ఆందోళన కలిగిస్తోందని శ్రీధర్ బాబు విమర్శించారు. ఇంత ముఖ్యమైన విషయంలో కేంద్రం అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని, భారతీయ ఐటీ రంగం, ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రాల భవిష్యత్తును కాపాడే దిశగా కృషి చేయాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ సంబంధాలు ఎంత ముఖ్యమో, దేశీయ ప్రయోజనాలను కాపాడుకోవడమూ అంతే ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు.