తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ (Aarogyasri ) సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 87 శాతం ఆస్పత్రులు పేషెంట్లకు నిరంతర వైద్య సేవలు అందిస్తుండగా, కేవలం 13 శాతం ఆస్పత్రుల్లో మాత్రమే తాత్కాలిక అంతరాయం ఏర్పడిందని వివరించారు. ప్రజలకు వైద్య సేవలు అడ్డంకులు లేకుండా అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సంబంధిత శాఖలు స్పష్టం చేస్తున్నాయి.
చికిత్సలను ఆపకుండా కొనసాగించాలి
ఆరోగ్యశ్రీ CEO ఉదయ్ కుమార్ (Udhai ) ఈ విషయంలో ఆస్పత్రి నిర్వాహకులతో ప్రత్యేకంగా సమావేశమై, చికిత్సలను ఆపకుండా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఆరోగ్యశ్రీ కింద గత రెండు వారాలుగా రోజుకు సగటున 844 శస్త్రచికిత్సలు (సర్జరీలు) జరగగా, ఈ రోజు మాత్రమే 799 సర్జరీలు పూర్తయ్యాయి. ఈ గణాంకాలు ఆరోగ్యశ్రీ సేవలు అంతరాయం లేకుండా సమర్థవంతంగా కొనసాగుతున్నాయనే విషయాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

ఆసుపత్రుల్లో చిన్నపాటి సమస్యలు కూడా తెలెత్తకూడదు
ఆరోగ్యశ్రీ పథకం పేదలకు అతి ముఖ్యమైన వైద్య భరోసా కాబట్టి ప్రభుత్వం దానిని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసుపత్రుల్లో చిన్నపాటి సమస్యలు తలెత్తినా, వాటిని వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేయాలని యోచిస్తోంది. పేదలు, మధ్యతరగతి ప్రజలు వైద్య ఖర్చుల భారం మోసే పరిస్థితి లేకుండా ప్రభుత్వ వైద్య సేవలు నిరంతరంగా కొనసాగించాలనే దిశగా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ప్రజలు నమ్మకంతో ఆస్పత్రులను ఆశ్రయించవచ్చని అధికారులు హామీ ఇస్తున్నారు.