కేరళలో ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ (PAM) వ్యాధి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఈ ఏడాదిలోనే 61 కేసులు నమోదయ్యి, 19 మంది మరణించడం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. ఈ వ్యాధి చాలా అరుదైనదైనా, ఒకసారి సోకితే మరణాలు ఎక్కువగా సంభవించడం ప్రజల్లో భయాందోళనను పెంచుతోంది. నీటి క్లోరినేషన్ సక్రమంగా లేకపోవడం, పరిశుభ్రమైన తాగునీటి అందుబాటులో లోపాలు ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నాయి.
మెదడును తినే అమీబా
ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్(PAM)ను నేగ్లేరియా ఫౌలెరీ అనే అతి సూక్ష్మ అమీబా వ్యాప్తి చేస్తుంది. దీనిని “మెదడును తినే అమీబా” అని కూడా పిలుస్తారు. కలుషితమైన నీటిలో ఈ అమీబా నివసిస్తుంది. ఈత లేదా స్నానం సమయంలో ముక్కు ద్వారా ఇది మన శరీరంలోకి ప్రవేశించి, నేరుగా మెదడు వరకు చేరుతుంది. అక్కడ నాడీ వ్యవస్థపై దాడి చేసి, తీవ్రమైన మంటలు, వాపులు కలిగిస్తుంది. ఫలితంగా బాధితులు తక్కువ కాలంలోనే ప్రాణాపాయ పరిస్థితికి చేరుకుంటారు.
ఫిట్స్ లాంటి తీవ్రమైన లక్షణాలు
ఈ వ్యాధి లక్షణాలు మొదట సాధారణ జ్వరంలా కనిపించినా, క్రమంగా తలనొప్పి, వికారం, వాంతులు, మెడ పట్టేయడం, గందరగోళం, ఫిట్స్ లాంటి తీవ్రమైన లక్షణాలు బయటపడతాయి. కేవలం వైద్యుల సమయోచిత నిర్ధారణతోనే ఈ వ్యాధిని గుర్తించడం సాధ్యం. కాబట్టి పరిశుభ్రమైన నీటిని మాత్రమే వినియోగించడం, ఈత కొలనులు, చెరువుల్లో తగిన శానిటేషన్ నిర్వహించడం, నీటికి సరైన క్లోరినేషన్ చేయడం తప్పనిసరి. ప్రజలు జాగ్రత్తగా ఉండి, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారానే ప్రాణాలను రక్షించుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.