భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని పగిడేరు గ్రామం భూతాప జలాల వల్ల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సాధారణంగా బోరుబావుల (Borewells ) నుంచి తాగునీరు లేదా ఉప్పు నీరు మాత్రమే లభిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం 80 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వేడి నీళ్లు ఉబికి వస్తుండటం అరుదైన విషయం. ఎలాంటి మోటార్లు లేకుండా భూమి లోతుల్లో నుంచి నిరంతరాయంగా వెలువడుతున్న ఈ వేడి జలాలను రైతులు ప్రత్యేకంగా నిల్వ ఉంచి, ఆ తర్వాత వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. గతంలో నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ గ్రామం ఇప్పుడు ఈ సహజసిద్ధమైన వనరుతో ఏటా వంద ఎకరాల వరి సాగు చేస్తోంది. వేసవిలో కూడా నీరు అందుబాటులో ఉండటం వల్ల రైతులు మరింత లాభాలు పొందుతున్నారు.

పగిడేరు భూతాప జలాలపై శాస్త్రీయ పరిశోధనలు 2014లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) ద్వారా ప్రారంభమయ్యాయి. వారు 1,000 మీటర్ల లోతులో నీళ్లు (Water) 180–220 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్నట్లు గుర్తించారు. భూగర్భంలో ఏర్పడిన పగుళ్లు ఈ వేడికి కారణమని నిపుణులు అంచనా వేశారు. సింగరేణి సంస్థ బొగ్గు నిక్షేపాల కోసం తవ్వకాలు చేపట్టినప్పుడు ఈ భూతాప జలాలు బయటపడటం, ఆ తర్వాత శాస్త్రీయంగా పరిశీలించడం గ్రామానికి కొత్త దిశను ఇచ్చాయి. ఈ సహజ వనరులను వృధా కాకుండా విద్యుత్ ఉత్పత్తికి వినియోగించాలనే ఆలోచనతో 2021లో పగిడేరులో ప్రయోగాత్మక జియో థర్మల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మద్దతు ఇవ్వగా, సింగరేణి మరియు శ్రీరామ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంయుక్తంగా పరిశోధనలు కొనసాగిస్తున్నాయి.
ప్రస్తుతం పగిడేరులో ప్రయోగాత్మకంగా 20 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి విజయవంతమైంది. భవిష్యత్తులో 122 మెగావాట్ల విద్యుత్ వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ (MNRE) కూడా పగిడేరును జియో థర్మల్ ప్లాంట్‌కు అనుకూలమైన క్షేత్రంగా గుర్తించింది. దీంతో అవసరమైన పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి ఇంపోర్ట్ డ్యూటీ, జీఎస్టీ మినహాయింపులు లభించనున్నాయి. వ్యవసాయానికి ఉపయోగపడుతున్న ఈ భూతాప జలాలు, విద్యుత్ ఉత్పత్తికి కూడా దోహదపడటంతో పగిడేరు దేశవ్యాప్తంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇది తెలంగాణలో పునరుత్పాదక ఇంధన రంగానికి కొత్త అవకాశాలు తెరిచే దిశగా ఒక మైలురాయిగా నిలుస్తోంది.