కరీంనగర్ మండలం దుర్షేడులో యూరియా (Urea ) కోసం రైతులు, మహిళా రైతులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహిస్తూ, బతుకమ్మ ఆటలతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వం వహించారు. యూరియా సరఫరా లోపంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, మహిళా రైతులు కూడా రోడ్డెక్కడం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
యూరియా కొరతపై గంగుల కమలాకర్ ఆగ్రహం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Kamalakar) మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రైతులు ఇంత కష్టాలు పడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా వరి పొట్టకు వచ్చే ఈ దశలో యూరియా అవసరం అత్యవసరం అయినప్పటికీ, అది రైతులకు అందడం లేదని తెలిపారు. యూరియా బ్లాక్ మార్కెట్‌కి తరలించడం వల్ల రైతులు సొసైటీల దగ్గర క్యూలలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుస్థితి పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధత కారణంగానే వచ్చిందని ఆయన ఆరోపించారు.
కఠిన హెచ్చరికలు, రైతుల డిమాండ్లు
రైతులకు యూరియా రెండు రోజుల్లో సరఫరా చేయకపోతే బ్లాకు గోదాములను కొల్లగొట్టేందుకు సిద్ధమని గంగుల కమలాకర్ హెచ్చరించారు. పంట నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి బతుకమ్మ ఆడుతూ నిరసన తెలపడంతో రాజీవ్ రహదారి పూర్తిగా స్తంభించింది. రైతులు చేతిలో యూరియా బస్తాలు పట్టుకుని నినాదాలు చేస్తూ, జిల్లా వ్యవసాయ అధికారి అక్కడికి రావాలని కోరారు. రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రైతులు బలంగా డిమాండ్ చేశారు.