ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారానికి దారితీస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి రాజధానిపై తన వైఖరిని మార్చుకుంటున్నారని ఆరోపిస్తూ, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణ తీవ్ర విమర్శలు చేశారు.
జగన్ వైఖరి పై నారాయణ విమర్శలు
మాజీ ముఖ్యమంత్రి జగన్ గతంలో అసెంబ్లీలో స్వయంగా అమరావతి (Amaravati) రాజధానికి మద్దతు తెలిపినప్పటికీ, అధికారం చేపట్టిన తర్వాత తన స్థానం పూర్తిగా మార్చుకున్నారని మంత్రి నారాయణ గుర్తుచేశారు.“రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు అవసరం అని జగన్‌నే అసెంబ్లీలో చెప్పారు. అప్పుడు మద్దతు ఇచ్చిన ఆయన, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టారు,” అని విమర్శించారు.
సజ్జల వ్యాఖ్యలపై తీవ్ర ప్రతిస్పందన
వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)ఇటీవల అమరావతిపై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి. విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని కట్టాలని సూచించిన ఆయన, ఈసారి జగన్ అధికారంలోకి వస్తే తాడేపల్లి నుంచే పాలన సాగిస్తారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ, “సజ్జల పార్టీ సీనియర్ నేత కాబట్టి, ఆయన మాటలను వైసీపీ అధికారిక అభిప్రాయంగా పరిగణించాల్సిందే,” అన్నారు. “గదిలో కొన్ని వ్యక్తుల సూచనలు వినిపిస్తూ ప్రజలను గందరగోళంలో పడేయడం సరికాదు” అని హెచ్చరించారు.
అమరావతి భౌగోళికంగా అనుకూలం – నారాయణ
అమరావతి భౌగోళికంగా రాష్ట్రానికి కేంద్రంగా ఉండే ప్రాంతమని, ఇది అన్ని ప్రాంతాలకు చేరువగా ఉందని నారాయణ తెలిపారు. “విశాఖపట్నం, అనంతపురం, శ్రీకాకుళం వంటి ప్రాంతాల నుండి కూడా అమరావతికి చేరుకోవడం సులభం. రైల్వే, రహదారి, విమానాశ్రయ సదుపాయాలన్నీ అమరావతిలో అందుబాటులో ఉన్నాయి,” అన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం రాజకీయం చేసే ప్రతి పార్టీ బాధ్యతగా ఉండాలన్నారు.
వైసీపీ నడిపిస్తున్న రాజకీయ వైఖరిపై ప్రజలు గమనిస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు.
“ఇలాంటి రాజకీయాలు చేస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతే, వచ్చే ఎన్నికల్లో 11 సీట్లూ దక్కకపోవచ్చు. ప్రజలు అంతా గమనిస్తున్నారు,” అంటూ వైసీపీకి హెచ్చరికలతో ముగించారు.
Read hindi news:hindi.vaartha.com
Read also: