అగ్ర కథానాయిక అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటించిన ‘ఘాటి’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రత్యేకమైన ప్రచార కార్యక్రమాలను చేపడుతోంది. తాజాగా, యూవీ క్రియేషన్స్ విడుదల చేసిన ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు ఆరు నిమిషాల నిడివి గల ఈ ఫోన్ సంభాషణలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనుష్క మధ్య ఆసక్తికరమైన మాటల మార్పిడి చోటుచేసుకుంది. ఈ క్లిప్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.సంభాషణలో ఇద్దరూ గతంలో కలిసి చేసిన సినిమాలను గుర్తు చేసుకున్నారు. ‘వేదం’, ‘రుద్రమదేవి’ వంటి చిత్రాల సమయంలో గడిపిన అనుభవాలను షేర్ చేసుకున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) సరదాగా, “నిన్ను స్వీటీ అని పిలవాలా లేక ఘాటి అని పిలవాలా?” అని అడగ్గా, అనుష్క నవ్వుతూ, “ఎప్పుడూ స్వీటీనే” అని సమాధానమిచ్చారు.(Vaartha live news : Anushka Shetty)
బన్నీకి కృతజ్ఞతలు తెలిపిన అనుష్క
అనుష్క మాట్లాడుతూ, తన కెరీర్లో అల్లు అర్జున్ ఎప్పుడూ మద్దతుగా నిలిచారని ప్రశంసించారు. ‘పుష్ప’లో పుష్పరాజ్ పాత్ర సమాజంపై చూపిన ప్రభావం విశేషమని ఆమె అన్నారు. దీనికి బన్నీ స్పందిస్తూ, “‘ఘాటి’లో నువ్వు చేసిన శీలావతి పాత్ర గురించి ఆసక్తిగా ఉన్నా” అని చెప్పారు.అల్లు అర్జున్ మాట్లాడుతూ, యాక్షన్ సన్నివేశాల్లో ఈ తరం హీరోయిన్లలో అనుష్కనే అగ్రస్థానంలో ఉంటారని కొనియాడారు. ఆమె పోషించిన శీలావతి పాత్ర యాక్షన్ సన్నివేశాల్లో కొత్త రేంజ్ చూపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
పుష్పతో సంబంధం ఉందా?
‘ఘాటి’ కథకు ‘పుష్ప’ ప్రపంచంతో సంబంధం ఉందనే వార్తలపై అనుష్క స్పష్టత ఇచ్చారు. ఆ మాట నేను చెప్పలేదు. సరదాగా ఒక ఇంటర్వ్యూలో సుకుమార్‌కి ఈ విషయం చెప్పాలని అన్నా అని వివరించారు.మాటల మధ్య అల్లు అర్జున్ సరదాగా, ఒకవేళ పుష్పరాజ్, శీలావతి కలిసి నటిస్తే దానికి ఎవరు దర్శకత్వం వహిస్తే బాగుంటుంది? అని ప్రశ్నించారు. అనుష్క తెలివిగా స్పందిస్తూ, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. దర్శకులు సుకుమార్, క్రిష్ ఇద్దరూ నాకు ఎంతో ముఖ్యమైనవారు అని చెప్పారు.క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘాటి’ సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ ఆడియో కాల్ ప్రమోషన్స్‌కు అదనపు ఊపునిచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సంభాషణ హాట్ టాపిక్‌గా మారింది.
Read Also :