యూత్ ను దృష్టిలో పెట్టుకుని కథలు చెప్పే సినిమాలు తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం సంపాదిస్తాయి. అలా వచ్చిన చిత్రాలలో ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ (Ladies And Gentlemen) ఒకటి. 2015 జనవరి 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, తన వినూత్నమైన కథా నిర్మాణం, ప్రెజెంటేషన్ తో మంచి చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవ్వడం వల్ల మళ్లీ ప్రేక్షకులు దీన్ని చూసే అవకాశం లభిస్తోంది.మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి మంజునాథ్ దర్శకత్వం వహించాడు.
కథ
ఆనంద్ (కమల్ రామరాజు) ఓ బిజినెస్ మెన్. అతను ఎప్పుడూ ఆఫీస్ పనులతో బిజీగా ఉంటూ తనని నిర్లక్ష్యం చేయడాన్ని భార్య ప్రియ (నికిత) తట్టుకోలేకపోతుంది. తనని పెద్దగా పట్టించుకోని భర్త పట్ల ఆమెకి అనుమానం కూడా ఉంటుంది. ఇక విజయ్ (మహత్ రాఘవేంద్ర) ఒక కాల్ సెంటర్ లో జాబ్ చేస్తూ ఉంటాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన అతను, అందుకోసం అప్పులు చేస్తూ ఉంటాడు.
కృష్ణమూర్తి (చైతన్య కృష్ణ) విషయానికి వస్తే, అతను కాస్త పద్ధతిగా పెరిగిన కుర్రాడు. అయితే గాళ్ ఫ్రెండ్ లేని కారణంగా అందరూ ఆటపట్టిస్తూ ఉండటంతో, ఎలాగైనా సరే ఒక అమ్మాయిని ముగ్గులోకి దింపాలనే ఉద్దేశంతో ఫేస్ బుక్ (Facebook) ద్వారా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మొత్తానికి అతని ప్రయత్నం ఫలించి, ‘దీప’ అనే అమ్మాయి అతని ట్రాక్ లో పడుతుంది. ప్రియ గతంలో తనతో పాటు చదువుకున్న రాహుల్ (అడివి శ్రీనివాస్) పట్ల ఆకర్షితురాలవుతుంది. విలాసాలకు అవసరమైన డబ్బు కోసం విజయ్ పక్కదారి పడతాడు. పర్యవసానంగా వారికి ఎదురయ్యే పరిస్థితులు ఏమిటి? అనేది కథ.

విశ్లేషణ
చేతిలోకి స్మార్ట్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి మనిషి జీవితంలో మార్పు మొదలైంది. సోషల్ మీడియా వలన ప్రేమలు .. పెళ్లిళ్లు .. కుటుంబ జీవితం అస్తవ్యస్తంగా మారిపోతోంది. ఇలాంటి పరిస్థితులలో నేరాలు కూడా అంతే స్మార్ట్ గా జరిగిపోతున్నాయి. అందువలన యువత ఇప్పుడు చాలా కేర్ ఫుల్ గా ఉండాలనే ఉద్దేశంతో రూపొందించిన సినిమా ఇది. ఆకర్షణ .. ప్రేమ .. పెళ్లి అనే మూడు అంశాలను ప్రధానంగా చేసుకుని, ముగ్గురు యువకుల చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఈ ముగ్గురు జీవితాలను సోషల్ మీడియా ఎలా ప్రభావితం చేసిందనేది దర్శకుడు చూపించిన విధానం బాగానే ఉంది. అయితే ప్రధానమైన కథాంశానికి ఎంటర్ టైన్ మెంట్ ను జోడించడానికి పెద్దగా ప్రయత్నించినట్టు అనిపించదు. అలాగే కథను ఏ మూల నుంచి పరిశీలించినా ఎక్కడా ఎమోషన్ కనిపించదు.
Read hindi news : hindi.vaartha.com
Read also: