ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) అంశం మరోసారి చర్చనీయాంశమైంది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను గట్టిగా ప్రశ్నించారు. ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తీవ్రస్థాయిలో స్పందించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. “ఎన్నికల ముందు ఊగిపోయిన ఆయన పౌరుషం ఇప్పుడు ఏమైంది?” అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అధికార కూటమిలోనూ, ప్రతిపక్షంలోనూ చర్చకు దారితీశాయి.
కూటమి ప్రభుత్వంపై ప్రశ్నలు
బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ మరియు అతని పార్టీ జనసేన ఎంపీలు “ఉప్పు, కారం తినడం లేదా?” అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జనసేన, కూటమి ప్రభుత్వ విధానం ఏంటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. “ఢిల్లీ వెళ్లి ఏం మాట్లాడుతున్నారు? విశాఖ ఉక్కుపై మీ వైఖరి ఏంటి?” అని బొత్స నిలదీశారు. ఈ ప్రశ్నలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ భవిష్యత్ పై కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన కార్యాచరణ లేదని పరోక్షంగా ఆరోపించాయి.
చంద్రబాబుకు సవాల్
ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించాలని బొత్స డిమాండ్ చేశారు. “కూటమి ప్రభుత్వం కార్యాచరణ ఏంటో చంద్రబాబు చెప్పాలి” అని ఆయన సవాల్ విసిరారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడతామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, దానిపై స్పష్టమైన ప్రణాళికను ప్రజల ముందు ఉంచాలని బొత్స కోరారు. ఈ వ్యాఖ్యలు విశాఖ ఉక్కు పరిరక్షణపై అధికార కూటమిపై రాజకీయ ఒత్తిడిని పెంచుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.