టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై మరో కేసు నమోదైంది. తన మాజీ ప్రేయసి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 30న రాజ్ తరుణ్ తన అనుచరులతో కలిసి తమ కుటుంబసభ్యులపై దాడి చేశారని లావణ్య ఆరోపించారు. ఈ దాడిలో తమ ఇంట్లో ఉన్న బంగారం ఎత్తుకెళ్లారని, అలాగే తమ పెంపుడు కుక్కను కూడా చంపారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
తండ్రికి గాయాలు
ఈ దాడి ఘటనలో తన తండ్రికి గాయాలయ్యాయని లావణ్య తెలిపారు. ఈ విషయం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో, ఆయన ఆదేశాల మేరకు నార్సింగి పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఇప్పటికే రాజ్ తరుణ్‌పై పలు కేసులు నమోదైన నేపథ్యంలో ఈ కొత్త కేసు ఆయన ఇమేజ్‌కు మరింత దెబ్బ తీసే అవకాశం ఉంది. కేసు నమోదు తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఈ ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ తరుణ్ అనుచరుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. ఇరువురి మధ్య గతంలో ఉన్న విభేదాలు, ఇప్పుడు ఈ దాడికి కారణమయ్యాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో, రాజ్ తరుణ్ దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి. ఈ కేసు టాలీవుడ్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.