కల్వకుంట్ల కవిత (Kavitha) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంపీ సంతోష్ రావు ధనదాహం ఉన్న వ్యక్తి అని ఆమె ఆరోపించారు. నేరెళ్లలో ఇసుక దందాకు పాల్పడి, దళితులను చిత్రహింసలు పెట్టినవాడే సంతోష్ అని కవిత విమర్శించారు. “స్కామ్ సంతోష్ పేరు తెచ్చుకున్నాడు.. కానీ చెడ్డపేరు మాత్రం కేటీఆర్‌కి పడుతోంది” అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
పదవులు, కాంట్రాక్టులు సంతోష్ ఆధీనంలోనే
కవిత మాట్లాడుతూ.. పోచంపల్లి శ్రీనివాస్, నవీన్ రావు లకు పదవులు, కాంట్రాక్టులు సంతోష్ రావే ఇప్పించాడని ఆరోపించారు. పార్టీ లోపల తన ప్రభావాన్ని చూపించుకుంటూ అనేక లాభాలు పొందాడని కవిత తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. అంతేకాకుండా ఆయన చర్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి అనవసరంగా చెడ్డపేరు వచ్చిందని ఆమె పేర్కొన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మోసం
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ (Green India Challenge) పేరుతో సంతోష్ రావు నకిలీ ప్రోగ్రాం నిర్వహించాడని కవిత ఆరోపించారు. పబ్లిసిటీ కోసం చిరంజీవి, ప్రభాస్ వంటి సినీ తారలను వాడుకున్నారని, వారిని కూడా మోసం చేశారని ఆమె విమర్శించారు. ప్రజాసేవ పేరుతో చేసిన ఈ కార్యక్రమాలు వాస్తవానికి స్వలాభం కోసం చేసినవని కవిత స్పష్టం చేశారు.