జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు విశాఖపట్నంలో ‘సేనతో సేనాని’ (Sentho Senani )పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరగనున్న ఈ సభ కోసం పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇటీవల పార్టీ నేతలు, కార్యకర్తలతో రెండు రోజుల పాటు వరుస సమావేశాలు నిర్వహించిన పవన్, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీకి జన సైనికులు, వీర మహిళలే నిజమైన బలమని పవన్ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
ఈ నేపథ్యంలో నేటి సభలో పవన్ కల్యాణ్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ పాత్ర, రాబోయే ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహాలు, ప్రజా సమస్యలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను పవన్ ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన స్థానాన్ని, దాని ప్రాముఖ్యతను ఈ సభ ద్వారా పవన్ కల్యాణ్ మరింత బలోపేతం చేయాలని యోచిస్తున్నారు. ఈ సభ, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.