దేశంలోని అన్ని వినాయక ఆలయాల్లో ప్రత్యేకమైనది కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం. సత్య ప్రమాణాల స్వామిగా ఇక్కడి గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. రోజు రోజుకూ పరిమాణంలో పెరుగుతూ భక్తుల కోరికలు తీర్చే స్వామిగా పేరు పొందాడు. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కాణిపాకం గ్రామంలో స్వయంభూగా వెలిసాడు.
ఆలయ చరిత్ర:
ఆలయ చరిత్ర గురించి ఎన్నో దశాబ్దాలుగా ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు వికలాంగ అన్నదమ్ములు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. పూర్వ జన్మ కర్మ ఫలంగా వారు గుడ్డి, మూగ, చెవిటివారిగా జన్మించారు. ఓ ఏడాది గ్రామం కరవుకాటకాలతో అల్లాడిపోయింది. తాగడానికి నీళ్లు కూడా దొరకని దుర్భర స్థితి ఏర్పడింది.
కరవును జయించడానికి ఈ ముగ్గురు సోదరులు (brothers) తమ పొలంలో ఉన్న ఏత బావిని లోతు చేయడానికి పూనుకున్నారు. బావిని తవ్వుతుంటే ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని పలుగు, పారల సాయంతో తొలగిస్తుండగా చేతిలో ఉన్న పార రాయికి తగిలి రక్తం చిమ్మి ఆ ముగ్గురి పై పడింది. దాంతో వారి వైకల్యం పోయి మామూలు మనుషులయ్యారు.
వాళ్లు వెంటనే ఆ గ్రామానిపాలిస్తున్న రాజుకు, (king) గ్రామస్థులకు జరిగిన విషయం వివరించారు. అక్కడికి చేరుకున్న గ్రామస్థులు బావిని పూర్తిగా తవ్వగా ‘గణనాథుని’ రూపం కనిపించింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో స్వామిని పూజించి, కొబ్బరికాయలు సమర్పించారు. అలా సమర్పించిన కొబ్బరికాయల నుంచి వచ్చిన తీర్థం ‘కాణి’ స్థలంలో (కాణి అంటే ఎకరం పొలం) పారింది. అప్పటినుంచి విహారపురి కాస్త ‘కాణిపాకరం’గా మారింది. కాలక్రమంలో ‘కాణిపాకం’గా స్థిరపడింది.

ఈ క్షేత్రం శివ, వైష్ణవ ఆలయాలకు నిలయం. ఆలయ ప్రాంగణంలో వరసిద్ధి వినాయక స్వామి ఆలయంతో పాటు మణికంఠేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరాంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. బావిలో ఉద్భవించిన వినాయకుడు క్రమంగా పరిమాణంలో పెరుగుతుండటం విశేషం. సుమారు అరవై అయిదు సంవత్సరాల క్రితం ఓ భక్తురాలు స్వామివారికి బహూకరించింది.కవచాలు, 2000వ సంవత్సరం లో మరో భక్తుడు ఇచ్చిన వెండి కవచాలు ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. ఒకప్పుడు ఇవి స్వామి ఆలంకరణలో భాగంగా వుండేది. భక్తులు వీటిని చూసేందుకు వీలుగా ఆలయంలో ప్రదర్శనగా ఉంచారు. ఇక్కడి స్వామివారి ఎదుట తప్పుడు ప్రమాణాలు చేస్తే శిక్ష అనుభవిస్తారని ప్రతీతి.
స్వామివారి క్షేత్రం పక్కనే ఉన్న బాహుదా నదిని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ నది వైశిష్ట్యానికి సంబంధించిన ఓ కథ ప్రచారంలో ఉంది. శంఖుడు, లిఖితుడు అనే సోదరులు స్వామివారిని దర్శించుకునేందుకు తమ గ్రామం నుంచి బయలుదేరారు. దారి మధ్యలో తినడానికి తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయాయి. అప్పటికి వాళ్లు కాణిపాకానికి చాలా దూరంలో ఉన్నారు. లిఖితుడు ఆకలికి తట్టుకోలేక పక్కనే ఉన్న మామిడితోటలో ఓ పండు కోసుకుని తింటానని అన్న శంఖుడిని అడిగాడు.

దొంగతనం చేయడం తప్పని శంఖుడు వారించాడు. అయినా లిఖితుడు అన్న చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి తోటలోని మామిడిపండు కోసుకుని తిన్నాడు. తమ్ముడు చేసిన దొంగతనం గురించి అన్న రాజుకు వివరించి, అతని రెండు చేతులు నరికివేయించాడు. కానీ తర్వాత తమ్ముడి వైకల్యాన్ని చూసి శంఖుడు చాలా బాధపడ్డాడు. ఇద్దరూ తిరిగి కాణిపాకం చేరుకుని, వినాయకుణ్ణి దర్శించుకునే ముందు పక్కనే ఉన్న నదిలో మునగగా లిఖితునికి పోయిన చేతులు తిరిగి వచ్చాయి.
అప్పటి నుంచి ఆ నదికి బాహుదా (బాహువులు ఇచ్చింది కనుక) అని పేరు వచ్చింది.)
21 రోజులు ఉత్సవాలు:
వరసిద్ధుని ఆలయంలో వినాయక చవితి మొదలు 21 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. మొదటి తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు, తరువాత 12 రోజులు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. రాష్ట్రంలో మరో ఆలయంలో ఇన్ని రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించరు.
కాణిపాకం తిరుపతికి ఎనభై కిలోమీటర్లు, జిల్లా కేంద్రం నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.
Read also: hindi.vaartha.com
Read also: