సత్తుపల్లి నియోజకవర్గంలో రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ పరిస్థితిని సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి (Matta Ragamayee) స్వయంగా పరిశీలించారు. కాంగ్రెస్ నాయకుడు డా. దయానందాతో కలిసి జోరు వర్షంలోనూ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటవద్దని ఆమె హెచ్చరించారు.
జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు
సత్తుపల్లి మండలంలోని జాతీయ రహదారి 365BBపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిష్టారం వై జంక్షన్ వద్ద కిష్టారం చెరువు పొంగి రహదారిపైకి నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న సత్తుపల్లి సీఐ తుమ్మలపల్లి శ్రీహరి వరద ప్రవాహాన్ని పరిశీలించి నీటిని మళ్లించే ప్రయత్నాలు చేపట్టారు. ఇదే కాకుండా కిష్టారం నుంచి చెరుకుపల్లి, యాతాలకుంట గ్రామాల మధ్య ఉన్న రహదారులు కూడా వరదనీటితో మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
ఖమ్మం జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సత్తుపల్లి సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. జేవీఆర్ ఓపెన్ కాస్ట్లో 98mm, కిష్టారం ఓపెన్ కాస్ట్లో 160mm వర్షపాతం నమోదైంది. భారీగా వరదనీరు గనుల్లోకి చేరడంతో జేవీఆర్, కిష్టారం ఓసీలలో దాదాపు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా, 2,60,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు కూడా నిలిచిపోయాయి. ఈ వర్షాల కారణంగా సింగరేణికి భారీ నష్టం వాటిల్లింది.