ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్థి రోజున గణేష్ చతుర్థి(Ganesh Chaturthi)ని ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది 2025లో ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి పండుగ జరగనుంది. అయితే చతుర్థి తిథి ఆగస్టు 26న మధ్యాహ్నం 1:54 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 27న మధ్యాహ్నం 3:44 గంటలకు ముగుస్తుంది. ఈక్రమంలో పండితుల సూచన ప్రకారం ఆగస్టు 27న ఉదయం 11:47 గంటల నుంచి మధ్యాహ్నం 1:41 గంటల వరకు వినాయక విగ్రహ ప్రతిష్ఠ, పూజలకు అత్యంత శుభ ముహూర్తంగా పరిగణిస్తున్నారు. ఈ సమయానికి పూజలు ప్రారంభిస్తే భక్తులు అతి శ్రేష్ఠమైన ఫలితాలను పొందుతారని విశ్వాసం ఉంది.
వినాయక పూజ ముహూర్తం, ప్రాముఖ్యత
ఆగస్టు 27 నుంచి ప్రారంభమయ్యే ఈ పండుగ తొమ్మిది రాత్రులు, పది రోజుల పాటు కొనసాగుతుంది. అనంతరం సెప్టెంబర్ 6న అనంత చతుర్దశి సందర్భంగా వినాయకుని నిమజ్జనం చేస్తారు. ఈ సమయంలో గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నియమ నిష్టలతో పూజ చేయడం వల్ల భక్తులకు గణనాథుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. పర్యావరణానికి మేలు కలిగే విధంగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించడం చాలా శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. గణనాథుడిని శ్రద్ధా భక్తులతో ఆరాధించడం వల్ల సకల విఘ్నాలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది.
మండపాల ఏర్పాటులో వాస్తు ప్రాముఖ్యత
గణేష్ చతుర్థి సందర్భంగా పట్టణాలు, పల్లెలు పండుగ వాతావరణంతో కళకళలాడుతున్నాయి. ఇప్పటికే గణేష్ మండపాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. పండితుల సూచన ప్రకారం మండపాల ఏర్పాటులో వాస్తు నియమాలు తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా గణనాథుడి ముఖద్వారం తూర్పు లేదా ఉత్తర దిశగా ఉంచితే అత్యంత శుభకరమని చెబుతున్నారు. ఈ విధంగా గణనాథుడిని ఆరాధిస్తే కుటుంబంలో ఐశ్వర్యం, శాంతి, సౌఖ్యం వర్ధిల్లుతాయని పండితుల అభిప్రాయం.