గురువు అంటే చీకటిని తొలగించేవాడు అని అర్థం. బాహ్య ప్రపంచపు చీకట్లు కావు. అజ్ఞానపు చీకట్లు విద్యా జ్ఞానం ప్రసాదించేవాడు జీవితం సక్రమమైన గతిలో సాగేలా మార్గదర్శకత్వం చేసేవాడు. మానవాళికి తొలి గురువు శ్రీ వేద వ్యాస మహర్షి. వేదాల నుండి అష్టాదశ పురాణాలు మరెన్నో మహాకావ్యాలు నిత్య పూజలో స్మరించే మంత్రాల వరకు అందించినవారు శ్రీ వ్యాస భగవానులు. అందుకనే గురువులను పూజించే ‘గురు పౌర్ణమి’ని ఆయన పేరుని ‘వ్యాస పూర్ణిమ’ అని పిలుస్తారు.
ఇలా మానవాళి ఆధ్యాత్మిక పురోగతికి విశేష కృషి చేసారు ‘కృష్ణ ద్వైపాయనుడు’ వేద వ్యాసునిగా కీర్తించబడుతున్నారు. విష్ణు పురాణం (Vishnu Purana) ప్రకారం లోకకల్యాణార్థం శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలు ఇరవై రెండు. వాటిలో శ్రీ వ్యాస దేవ ఒకటి భాగవత, గరుడ, మత్యం పురాణాలు కూడా ఇదే పేర్కొన్నాయి. అభ్యాసానికి(practice) అసంభవమైన అనంత వేదరాశిని సులభసాధ్య అధ్యయనానికి అనువుగా నాలుగు భాగాలుగా వర్గీకరించిన మహా జ్ఞాని జన్మ వృత్తాంతం చిత్రంగా జరిగింది.
వ్యాస జననం
వ్యాస జననం గురించి కొంత వివరంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కారణం ‘పంచమ వేదం’గా కీర్తించబడే మహాభారతంలో కనిపించేవి నేటికీ మనం మన సమాజంలో చూడవచ్చు. మహాభారతంలోని అనేక పాత్రల జీవితాలు కర్మతో ముడిపడి అలా ఎన్నో పాత్రల కర్మ ఫలం ఒకదానితో మరొకటి అనేక సంఘటనలకు దారి తీస్తాయి. వాటిలో కొన్ని నమాజ శ్రేయస్సుకు దారితీయగా ద్వేషభావాలను నెలకొల్పడం జరిగింది. యుగయుగాల శుభం కోసం జరిగిన పరిణామాలలో శ్రీకృష్ణ ద్వైపాయన ఒకటి.
దేవతలు అభిమానంతో ప్రసాదించిన విమానంలో ఆకాశయానం చేయడం వలన ‘ఉపరిచరవసు’గా పిలవబడిన చేది రాజు ‘ఎసువు’ గొప్ప యోధుడు. ధర్మపాలకుడు, మహావిష్ణువు భక్తుడు ఈయన ప్రస్థాపన స్కంద, వాయు పురాణాలలో, మహాభారతంలో కనిపిస్తుంది. ‘కోలాహలుడు’ అనే పర్వతరాజు ‘శక్తిమతి’ అనే సుందర నదీ దేవతను వలచి అనూహ్యంగా పెరిగి ఆమె ప్రవాహ మార్గానికి అడ్డం పడి చెరపట్టాడట.
శక్తిమతి ప్రార్థన విన్న ఉపరిచరవసు కోలాహాలుని ఒక్క తాపుతో రెండుగా చేసి నది స్వేచ్ఛగా ప్రవహించడానికి దారి కల్పించారట. అప్పటికే కోలాహలుని వలన ‘వసుపదుడు’ అనే కుమారుడు, ‘గిరిక అనే కుమార్తె కలిగారు. ఉపరిచరవసు శక్తిమతి కోరిక మేరకు గిరికను వివాహం చేసుకొని, వసుపదుని తన సర్వసేనాధిపతిగా నియమించుకొన్నాడట.
ఒకనాడు విశ్రాంతి తీసుకొంటున్న రాజుకు అందమైన గిరిక రాణి తలంపుకు వచ్చింది. భార్య ఊహతో స్థానించిన రాజు వీర్యాన్ని ఒక ఆకు దొన్నెలో ఉంచి, దానిని ఒకనడేగ దగ్గరకు తన చేర్చమన్నాడట. డేగ తీసుకొని పోతున్నది ఆహారం అని భావించి మరో డేగ యుద్ధానికి రావడంతో వీర్యం నదిలో పడిపోయింది. శాపవశాత్తూ చేప జన్మ ధరించిన ‘ఆద్రిక’ అనే అప్సరస ఆ వీర్యాన్ని ఆహారంగా భావించి తీసుకొన్నదట.
ఒక మత్సకారుడు విసిరిన వలలో ఆద్రిక చిక్కుకున్నది. చేప గర్భంలో ఒక బాలిక, బాలుడు ఉన్నారు. నదీ తీరంలో ఉన్న మత్స్యకారులు రాజు దాశరాజు విషయం తెలుసుకుని ఆ బిడ్డలను చక్రవర్తి వసువు వద్దకు తీసుకొని వెళ్లగా దివ్యదృష్టితో జరిగింది తెలుసుకున్న చక్రవర్తి మగబిడ్డను తన వారసునిగా స్వీకరించారట. బిడ్డలు లేని దాశరాజు ఆడబిడ్డకు సత్యవతి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగారట. చేప గర్భంలో ఉండటం వలన ఆ బాలిక శరీరం నుండి చేపల వాసన వచ్చేది. దాంతో అందరూ మత్స్యగంధి అని పిలిచేవారట.
తండ్రి ఆదేశం మేరకు సత్యవతి బాటసారులను పడవలో నది దాటించేది. అలా ఒకనాడు వశిష్ఠ మహర్షి మనుమడైన పరాశర మహర్షి అక్కడికి వచ్చారు. పరాశరుడు జ్యోతిష్య శాస్త్ర సృష్టికర్త. ఆయనను సగౌరవంగా ఆహ్వానించినదట సత్యవతి. ఆమెను చూడగానే భవిష్యత్తు తెలియకుండా తన మానసిక శారీరక నిష్ఠను కోల్పోయారట. తన పొందును వాంఛించిన మహర్షిని సత్యవతి ఎన్నో విధాలుగా ప్రయత్నించింది.
ఆమెను సముదాయించి అనేక వరాలను ఇచ్చారు. వాటి కారణంగా జన్మించినది మొదలు ఆమె శరీరం నుండి వాసన పోయి సువాసనలను వెదజల్లడం మొదలైంది. నాటి నుండి యోజన గంధిగా పిలువబడింది. పట్టపగలు నదీ ద్వీపంలో తపశ్శక్తి కారణంగా చుట్టూ అలుముకున్న చీకట్లలో మహర్షి ద్వారా జన్మతః దండ కమండలాలతో ముని వేషంలో బాలుడికి జన్మనిచ్చింది సత్యవతి. తల్లితండ్రులకు నమస్కరించి అవసర సమయంలో తలుచుకొంటే కళ్లముందు ఉంటానని చెప్పి తపోవనానికి వెళ్ళిపోయాడు. చీకటిలో ద్వీపంలో జన్మించడం వలన శ్రీకృష్ణ ద్వైపాయనుడు అని పిలిచేవారు.

శ్రీకృష్ణ ద్వైపాయనుడు – వేద వ్యాసుడు
విధాత బ్రహ్మ ధ్యానంలో ఉన్నప్పుడు అసంకల్పితంగా ఒక శబ్దం వెలువడిందట. ఆ ఆ శబ్దం నుండి ఓంకారం, అక్షరాలు ఉద్భవించాయి. ప్రణవ నాదమే సకల మంత్రాలకు బీజాక్షరం. ఆ ప్రణవం నుండి వేదాలు వెలువడినయట. వాటి సృష్టికర్త తన మానస పుత్రుడైన మరిచి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన తన కుమారుడైన కశ్యపునికి అధ్యయనార్థం అందించాడు.
ఇలా పరంపరాగతంగా సాగుతున్న వేదాధ్యయనం సామాన్య ప్రజలకు అర్థం కానీ దగ్గరగా భాషలో ఉండటం వలన వాటిని అధ్యయనం చేయలేకపోవడం గమనించాడు కృష్ణ ద్వైపాయనుడు. వేదరాశిని నాలుగు భాగాలుగా విభజించాడు. అవి: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. ఆ విధంగా శ్రీకృష్ణ ద్వైపాయనుడు వేదవ్యాసునిగా కీర్తించబడ్డారు. లోక సంరక్షణార్థం శ్రీమహావిష్ణువు ఎన్నో అవతారాలు ధరించారని విష్ణు పురాణం తెలుపుతోంది. ఆ అవతారాలలో శ్రీ వేద వ్యాస భగవాన్ అవతారం కూడా ఒకటి.
వేద విభజనతో పాటు వ్యాసుడు వేద ఉపనిషత్తుల సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించారు. తన శిష్యులైన రోమ, పైల, వైశంపాయన, జామిని మహర్షుల ద్వారా భూమండలం నలుదిశల వ్యాప్తి చేశారు.
మహాభారతం – శ్రీ వేదవ్యాసుడు
పంచమ వేదంగా ప్రస్తుతించబడే మహాభారత రచన చేయడమే కాకుండా కీలక పాత్ర పోషించారు వేదవ్యాసుడు. కురు, పాండవ జననానికి పరోక్షంగా కారణమైనారు. దాశరాజు పెంపుడు పుత్రిక యోజన గంధిగా పిలవబడే సత్యవతిని చూసి మోహంలో పడి వివాహానికి సిద్ధపడ్డారు శంతన మహారాజు. తన కుమార్తెకు జన్మించే బిడ్డలకే రాజ్యాధికారం దక్కాలని…దాశరాజు శరతు పెట్టడంతో గంగా పుత్రుడైన దేవవ్రతుడు తండ్రి సుఖాన్ని కోరి భీష్ము ప్రతిజ్ఞ చేసి భీష్మునిగా ప్రసిద్ధుడైనాడు. సత్యవతి, శంతనులకు జన్మించిన చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అల్పాయుష్కులుగా మరణించడంతో వంశం వారసులు లేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు సత్యవతి వ్యాసుని కోరిన కోరిక మేరకు అంబిక, అంబాలికలకు దృతరాష్ట్ర, పాండురాజుల జన్మకు అంతఃపుర దానికి విదురుని జన్మకు కారణమైనారు వ్యాసులు. వారి సంతానమే కౌరవులు పాండవులు.
అనంతర కాలంలో గాంధారి గర్భస్రావం అయినప్పుడు ఆ పిండాన్ని నూరు భాగాలు చేసి నేతి పాత్రలలో భద్రపరచి శత కౌరవ జన్మకు పరోక్ష సహాయం చేశారు. ఇలా ఎన్నో సందర్భాలలో వేద వ్యాసుడు కీలక పాత్ర పోషించారు.
వేద వ్యాస ఆలయాలు
వేదవ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకరు. మిగిలినవారు పరశురాముడు, విభీషణుడు, బలి చక్రవర్తి, హనుమంతుడు, కృపుడు, అశ్వత్థామ. పరమ పూజ్యనీయులైన శ్రీ వ్యాస దేవునికి మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనవి కేదారనాథ్ తో పాటు కేరళలోని అలప్పుళ జిల్లాలోని నీరట్టపురంలో ఉన్నది. అమరావతికి సమీపంలోని వైకుంఠ పురంలో నూతనంగా శ్రీ వ్యాస ధర్మక్షేత్రం పేరుతో సుందరి ఆలయాన్ని నిర్మించడం జరిగింది.
మిగిలిన ఆలయాలకు భిన్నంగా ఇక్కడ శ్రీ వేద వ్యాస భగవాన్ బోధనల గురించి విశేష ప్రచారం చేయడం చెప్పుకోవలసిన విషయం. భగవాన్ శ్రీ వేద వ్యాసులవారు మహాభారత రచనకు తగిన లేఖకునిగా గణపతిని ఎంచుకొన్నారు. అంతరాయం లేకుండా ఆయన ఆశువుగా చెబుతుంటే వినాయకుడు ఘంటం అపకుండా రచించారని అంటారు. అపూర్వ రీతిలో రచించబడిన మహాభారత రచన జరిగినట్లుగా కనిపించే ప్రదేశాలు రెండు కనిపిస్తాయి మన దేశంలో.

వ్యాస గుహ, మానా
పావన హిమాలయ సానువులలో పవిత్ర సరస్వతీ నదీ తీరంలో ‘మానా’ గ్రామం మన దేశంలో చిట్టచివరిది. శ్రీ మన్నారాయణుడు శ్రీ బద్రీనారాయణునిగా కొలువు తీరిన బద్రీనాథ్క సమీపంలో ఉన్న ఈ గ్రామంలో ఉన్న వ్యాస గుహలో మహాభారత రచన జరిగిందని స్థానిక గాథలు తెలుపుతాయి. దీనికి ప్రమాణంగా పేర్చిన పుస్తకాల దొంతర మాదిరి కనిపించే గుహలోని రాళ్లను చూపిస్తారు. పక్కనే శ్రీ గణేశ గుహ కూడా ఉంటుంది. ఒక అద్దాల పెట్టెలో కొన్ని తాళపత్రాలు ఉంటాయి.
బేద బ్యాస్ రూర్కెలా, ఒడిశా
ఉక్కు నగరంగా ప్రసిద్ధి చెందిన రూర్కెలా నగరంలో బ్రాహ్మణి నదీ తీరంలో చిన్న పర్వతాన్ని స్థానిక భాషలో బేద బ్యాస్ అని పిలుస్తారు. పర్వతం పైన ఉన్న గుహలో మహాభారత రచన జరగడం వలన ఈ పేరు వచ్చినట్లుగా చెబుతారు. పర్వతం పైన శ్రీకృష్ణ, శ్రీ పరమేశ్వర, శ్రీ అంజనేయ ఆలయాలు దర్శించుకోవచ్చు.
మానవాళికి తరతరాల వరకు విద్య విజ్ఞానం, ఆధ్యాత్మిక పురోగతి కావలసిన పటిష్ట మార్గాన్ని ఏర్పాటు చేసిన ప్రథమ గురువు భగవాన్ శ్రీ వేదవ్యాసులు. నిత్యస్మరణీయులైన వారి రూపాన్ని, మనకు విద్య, ఆధ్యాత్మిక ప్రభోధనలను చేసిన గురువులను వ్యాస/గురు పౌర్ణమి నాడు పూజించడం మనందరి కర్తవ్యం.
ఓం నమో భగవతే వ్యాస దేవాయ..
Read also: hindi.vaartha.com
Read also: