గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో పదో తరగతి విద్యార్థి నయన్ సంతానీ (Nayan Santani) దారుణ హత్యకు గురవడం సంచలనంగా మారింది. స్కూల్ సమయానంతరం విద్యార్థుల మధ్య చిన్నపాటి మాటామాటా ఘర్షణ పెద్ద దారుణానికి దారి తీసింది. అహ్మదాబాద్‌లోని సెవెంత్-డే అడ్వెంటిస్ట్ హయ్యర్ సెకండరీ స్కూల్ వెలుపల మంగళవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి కత్తి దాడి చేసి, పదో తరగతి విద్యార్థి ప్రాణాలు తీసిన సంఘటన ఆందోళన కలిగిస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్ చాట్‌తో బయటపడిన నిజం
నిందితుడు హత్య అనంతరం తన స్నేహితుడితో ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్ (Instagram Chatting) జరిపిన విషయాన్ని పోలీసులు బహిర్గతం చేశారు. “అవును, నేనే పొడిచాను.. జరిగిందేదో జరిగిపోయింది” అంటూ నిర్లక్ష్యంగా చెప్పిన చాట్ అతడి మనస్తత్వాన్ని స్పష్టంగా చూపిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వాడకం ఎంత వరకు పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.

ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి
తీవ్ర గాయాల కారణంగా రక్తస్రావం ఎక్కువయ్యింది. నయన్ తిరిగి స్కూల్‌లోకి పరుగెత్తి కుప్పకూలిపోయాడు. సిబ్బంది సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మరణించాడు.
స్నేహితుడి ప్రశ్నలకు నిందితుడి సమాధానాలు
స్నేహితుడు నువ్వేమైనా చేశావా? అని అడగగా, నిందితుడు ఎలాంటి సందేహం లేకుండా అవును అని సమాధానమిచ్చాడు. నువ్వే కత్తితో పొడిచావా? అని ప్రశ్నించగా, నిందితుడు నీకెవరు చెప్పారు? అంటూ ఎదురు ప్రశ్నించాడు. ఇది అతని నిర్లక్ష్య ధోరణిని స్పష్టంగా చూపిస్తుంది.
నిందితుడు తన నేరాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయకుండా “నేనే పొడిచాను” అని స్పష్టంగా ఒప్పుకున్నాడు. స్నేహితుడు ఎందుకు పొడిచావు? అని అడగగా, నన్ను రెచ్చగొట్టాడు. ‘నువ్వేం చేస్తావ్?’ అని సవాల్ విసిరాడు అని కారణం చెప్పాడు.
స్నేహితుడు అంతమాత్రానికే చంపేస్తావా? అని ప్రశ్నించగా, నిందితుడు జరిగిందేదో జరిగిపోయింది, వదిలెయ్ అంటూ తేలికగా సమాధానమిచ్చాడు. ఒక ప్రాణం తీశాననే బాధ లేకుండా చూపిన ఈ తీరుపై సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: