వాయవ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ రోజు మధ్యాహ్నం ఒడిశా-ఉత్తర ఆంధ్ర (Odisha-North Andhra) తీరాల మధ్య భూభాగాన్ని తాకే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని గోపాలపూర్ దక్షిణ ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉండి, వాయవ్య దిశగా కదులుతోంది.

తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు
వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు, మిగిలిన కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.
శ్రీకాకుళంలో అప్రమత్త చర్యలు
భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఒక రోజు సెలవు ప్రకటించారు. ఇప్పటికే నాగావళి నదిలో వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు ప్రజలను జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
ప్రజలకు సూచనలు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Minister Rammohan Naidu), రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా అధికారులకు తగిన సూచనలు చేశారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలని, ముఖ్యంగా మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
తుపాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు శ్రీకాకుళం కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ (08942–240557) ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ నంబర్ ద్వారా సహాయం కోరాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: