తెలంగాణ రాష్ట్రంలో గత పదిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వానలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రోడ్లపై నీరు నిల్వ ఉండడం, చెరువులు, వాగులు పొంగిపొర్లడం, లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాధారణ జనజీవనం దాదాపు స్తంభించిపోయే స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) మరోసారి రాష్ట్ర ప్రజలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది.అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు జిల్లాలలో వర్షాలు మరింతగా కురుస్తాయని హెచ్చరించారు.
మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ వర్షాలకు ప్రధాన కారణమని తెలిపారు. ఈ అల్పపీడనం ఇవాళ మధ్యాహ్నం నాటికి మరింత బలపడి వాయుగుండంగా మారి, దక్షిణ ఒడిశా–ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.వర్షాల కారణంగా ఇప్పటికే అనేక జిల్లాలలో నష్టాలు సంభవించాయి. వరి, పత్తి, మిర్చి వంటి పంటలు నీటమునిగాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు. రహదారులు దెబ్బతినడంతో రవాణా అంతరాయం ఏర్పడింది. పల్లెటూర్లలో విద్యుత్ సరఫరా (Power supply) కూడా స్తంభించింది. నగరాల్లో అయితే రోడ్లపై గుంటలు ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు పెరిగాయి. వర్షపు నీరు గృహాలలోకి చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలు
నేడు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.ఈ మూడు రోజుల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
గత రాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొడుతోంది
గడిచిన 24 గంటల్లో సిద్దిపేట జిల్లా గౌరారంలో అత్యధికంగా 23.6 సెం.మీ., మెదక్ జిల్లా అల్లాదుర్గ్‌లో 22 సెం.మీ. వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ (తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ) పేర్కొంది. జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయని పేర్కొన్నారు. కాగా, గత రాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొడుతోంది. తెల్లవార్లు కురిసిన వర్షంతో నగర రహదారులు జలమయమయ్యాయి. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కడిక్కడ వరద నివారణ చర్యలు చేపట్టారు. నేడు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నందున జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షం కురిసే సమయంలో అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: