ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, సీసీటీవీ ఫుటేజీ ఇవ్వడానికి ఎన్నికల సంఘం (EC) నిరాకరించడంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ప్రైవసీ కారణంగా సీసీటీవీ ఫుటేజీ ఇవ్వలేమని ఈసీ చేసిన ప్రకటనపై ఆయన మండిపడ్డారు. ఇది ఒక సాకు మాత్రమేనని, పారదర్శకత కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తన ‘X’ ఖాతాలో పోస్ట్ చేశారు.
పోలింగ్ బూత్‌లు డ్రెస్ ఛేంజింగ్ రూమ్‌లు కావు
ప్రకాశ్ రాజ్ (Prakash Raj) తన పోస్ట్‌లో ఈసీ వాదనను తీవ్రంగా ఖండించారు. “పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు పెట్టే ముందు మీరు మహిళల అనుమతి తీసుకున్నారా? పోలింగ్ బూత్‌లు డ్రెస్ ఛేంజింగ్ రూమ్‌లు కావు” అని ఆయన ప్రశ్నించారు. ఈసీ చెప్పే సాకులు తమకు ఆసక్తి లేవని, ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత కావాలని ఆయన స్పష్టం చేశారు. ఓట్ల చోరీ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈసీపై ఉందని ఆయన అన్నారు.
ప్రతిపక్షాల డిమాండ్
ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, పోలింగ్ సీసీటీవీ ఫుటేజ్‌లను విడుదల చేస్తే నిజాలు బయటపడతాయని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈసీ ఈ ఫుటేజ్‌లను ఇవ్వడానికి నిరాకరించడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఈ వివాదం రాజకీయ వర్గాల్లో మరింత వేడి పుట్టిస్తోంది.