తెలంగాణ రాష్ట్రంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా, లోతట్టు ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
శనివారం (ఆగస్టు 16) వర్ష సూచన
శనివారం రోజున నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. అదేవిధంగా, ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆదివారం (ఆగస్టు 17) వర్ష సూచన
ఆదివారం రోజున నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.