బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీని కారణంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. రుతుపవనాలు మరింత ఊపందుకోవడంతో వర్షపాతం ప్రభావం తెలంగాణ (Telangana)రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది.

వాతావరణ శాఖ హెచ్చరిక
వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం ఈ రోజు (ఆగస్ట్ 16) ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం-ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా, మరో 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ప్రభావితమయ్యే జిల్లాలు
భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు (Heavy rains today) కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్‌లో వర్ష బీభత్సం
శుక్రవారం (ఆగస్ట్ 15) సాయంత్రం నుంచే జంటనగరాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాత్రి 11 గంటల వరకు వర్షం కురవడంతో నగరంలో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. కూకట్‌పల్లిలో అత్యధికంగా 6.58 సెం.మీ., జీడిమెట్లలో 6.08 సెం.మీ., శంషిగూడలో 5.75 సెం.మీ., షాపూర్‌నగర్‌లో 5.70 సెం.మీ., గాజులరామారంలో 5.63 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
ముందస్తు సూచనలు
అల్పపీడనం ప్రభావం కొనసాగుతుండటంతో ఈ రోజు, రేపు నగరంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు వెళ్ళకూడదని, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: