Amaravati : అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రికి (Cancer hospital) మొదటి విడతలో రూ.750 కోట్లు ఖర్చు చేస్తున్నామని హిందుపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, దాతలు ముందుకొస్తున్నారని చెప్పారు. మొదటి విడత పనులు 2028 కల్లా పూర్తిచేసి వైద్యసేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల (Telugu states) ప్రభుత్వాలు, కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గుండె జబ్బుల స్థానంలో కేన్సర్ జబ్బులు ఇటీవల పెరిగాయని తెలిపారు. క్యాన్సర్ పరిశోధనలు కూడా ఇక్కడే నిర్వహించేలా సౌకర్యాలు కల్పించనున్నట్లు బాలకృష్ణ వివరించారు. రాజధాని అమరావతిలోని తుళ్లూరు సమీపంలో బసవతారకం కేన్సర్ ఆసుప్రతికి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొని భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ అత్యుత్తమ కేన్సర్ ఆసుపత్రిగా దేశంలోనే బసవతారకం కేన్సర్ ఆసుప్రతి మంచి పేరు తెచ్చుకుంది. అత్యాధునిక క్యాన్సర్ వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందిస్తున్నాం. అదేవిధంగా రోగులకు రేడియేషన్ కోసం అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేశాం. మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా ప్రజల వద్దకు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నాం. హాస్పిటల్కి క్యాన్సర్ నిపుణులు నోరి దత్తాత్రేయ ఇస్తున్న సహకారం మరువలేనిది. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 2019లో శంకుస్థాపన జరిగిందని బాలకృష్ణ పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని అంధకార పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు.

రాజధాని అమరావతిలో 21 ఎకరాల్లో బసవతారకం కేన్సర్ ఆసుప్రతిని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్యాంపస్లో సమగ్ర క్యాన్సర్ చికిత్స, పరిశోధనతోపాటు రోగుల సంరక్షణకు ఎక్స్ లెన్సీ సెంటర్ అందుబాటులోకి తెస్తారు. తొలి దశలో 500 పడకల సామర్థంతో విస్తృత శ్రేణి ఆంకాలజీ సేవలు అందించనున్నారు. అదేవిధంగా రూ.750 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు, అధునాతన పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స తదితర ప్రక్రియలకు ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్ ఏర్పాటుచేసి 2028 నాటికి ఆపరేషన్లు ప్రారంభించాలని భావిస్తున్నారు. రెండో దశలో పడకల స్థాయి వెయ్యికి పెంచుతారు. ప్రత్యేక విభాగాలు, పరిశోధన విభాగాల ఏర్పాటు, క్లిష్టమైన, అధునాతన కేన్సర్కేసులకు ప్రాంతీయ రిఫరల్కేంద్రంగా ఈ క్యాంపస్ను తీర్చిదిద్దనున్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :