హైదరాబాద్ High Court : ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని గోషామహల్ స్టేడియానికి తరలించే అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు (High Court Notices) జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. గోషామహల్ స్టేడియంలో నూతన భవనం నిర్మించి ఉస్మానియా ఆసుపత్రిని అక్కడకి తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాము అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. స్టేడియానికి చెందిన స్థలాన్ని ఆసుపత్రికి బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని, ఇది పట్టణ ప్రాంతాల అభివృద్ధి చట్టాలకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. స్టేడియంలో పాఠశాల ఉందని, విద్యార్థులకు చెందిన ఆటస్థలంలో ఆసుపత్రి నిర్మాణం (Hospital construction) సరికాదని పేర్కొన్నారు.

ప్రస్తుతం మైదానం కూల్చివేత పనులు జరుగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేసినట్లు అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. పేదలకు వైద్య సదుపాయం అందించడానికి ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని ఆయన అన్నారు. ఎంత స్థలంలో నిర్మాణం చేపడుతున్నారు? ఇంకా ఎంత ఖాళీ స్థలం ఉంది? వంటి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కావాలని ఏజీ కోరగా, అందుకు అనుమతిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 26కు వాయిదా వేసింది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :