ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో పోలీసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కుమ్మక్కై, వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa ) విమర్శించారు. ముఖ్యంగా, ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ దాడులు పెరిగాయని ఆయన మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ
ఈ విషయమై వైఎస్సార్‌సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తోందని, దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని బొత్స తెలిపారు. ఈ దాడుల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, దీనిపై గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరినట్లు చెప్పారు. తమ ఫిర్యాదుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు.
కూటమి ప్రభుత్వ దుష్ట పాలన
అంతేకాకుండా, పులివెందులలో జెడ్‌పీటీసీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని గవర్నర్‌ను కోరినట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వ దుష్ట పాలన, దాడుల గురించి గవర్నర్‌కు వివరించినట్లు పేర్కొన్నారు. ఇలాంటి అరాచకాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్‌ను కోరారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులకు రక్షణ కల్పించాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు బొత్స తెలిపారు.