తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ రిజర్వేషన్ల (BC Reservation) విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఒక ధర్నాలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్రం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లులు గత నాలుగు నెలలుగా కేంద్రం మరియు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని, దీనిపై రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ఈ పోరాటం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.
మోదీపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన మహాధర్నాలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్లకు ప్రధాన శత్రువు ప్రధాని నరేంద్ర మోదీయేనని ఆరోపించారు. ‘మోదీ మెడలు వంచైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తాం’ అని ఆయన శపథం చేశారు. తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంటే కేంద్రానికి కడుపు మంట ఎందుకని ఆయన ప్రశ్నించారు. ‘మా డిమాండ్‌ను ఆమోదిస్తారా, లేక రాహుల్ గాంధీని ప్రధానిగా చేసి సాధించుకోవాలా?’ అని ఆయన మోదీకి సవాల్ విసిరారు.
బీఆర్‌ఎస్, బీజేపీలపై రేవంత్ విమర్శలు, భవిష్యత్ కార్యాచరణ
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ మరియు బీజేపీ నాయకులపై కూడా విమర్శలు గుప్పించారు. తమ ధర్నాను ‘డ్రామా’ అని విమర్శించిన కేటీఆర్‌పై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పేరులోనే ‘డ్రామా’ ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు కూడా మోదీతో కలిసి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణతో పేగుబంధం తెగిపోయిందా అని ప్రశ్నిస్తూ, ధర్నాకు వారు ఎందుకు రాలేదని నిలదీశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాతే కులగణన చేపట్టి చరిత్ర సృష్టించామని, ఇది దేశానికి రోల్ మోడల్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో బీజేపీని గద్దె దించుతామని ఆయన స్పష్టం చేశారు.
Read Also : Trump Tariffs : భారత్ పై భారీగా సుంకాలు పెంచిన ట్రంప్