తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ACB) తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. అవినీతిపరుల ఆట కట్టించేందుకు మరింత అగ్రెసివ్‌గా వ్యవహరిస్తోంది. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ) బాలసుబ్రమణ్యం, కళ్యాణలక్ష్మి పథకానికి సంబంధించిన పని కోసం ఒక వ్యక్తి నుంచి రూ. 4,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు మండల ఆసుపత్రి సమీపంలో వ్యూహాత్మకంగా వల పన్ని బాలసుబ్రమణ్యంను పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయనపై తహసీల్దార్ కార్యాలయంలో విచారణ జరుగుతోంది. భూత్పూర్ రెవెన్యూ కార్యాలయంలో గతంలోనూ లంచాల వసూళ్లపై ఆరోపణలున్న నేపథ్యంలో ఈ అరెస్టు ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏసీబీ గణాంకాలు – అవినీతిపై ఉక్కుపాదం
తెలంగాణలో ఏసీబీ అధికారులు అవినీతి నిర్మూలనకు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. లంచాల పేరిట ప్రజలను వేధిస్తున్న అధికారులను పట్టుకోవడమే కాకుండా, అక్రమాలు ఎక్కువగా జరుగుతున్న ప్రభుత్వ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. జులై నెలలో ఏసీబీ మొత్తం 22 కేసులు నమోదు చేసింది. వీటిలో 13 ట్రాప్ కేసులు, ఒక అసమాన ఆస్తుల కేసు, ఒక క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు, ఒక రెగ్యులర్ ఎంక్వైరీ, ఆరు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయి. ఈ నెలలో మొత్తం 20 మందిని అరెస్టు చేయగా, వారిలో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఒక ప్రైవేట్ వ్యక్తి ఉన్నారు. ట్రాప్ కేసుల్లో రూ. 5.75 లక్షల నగదును స్వాధీనం చేసుకోగా, అక్రమాస్తుల కేసులో రూ. 11.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు ఏసీబీ మొత్తం 148 కేసులు నమోదు చేసి 145 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసింది.
ప్రజలకు అవగాహన – అవినీతి నిర్మూలన
ఏసీబీ అధికారులు కేవలం అరెస్టులు, దాడులకే పరిమితం కాకుండా, అవినీతి నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, స్టిక్కర్ల రూపంలో ఈ నంబర్‌ను ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవినీతిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల సహకారంతోనే అవినీతి రహిత సమాజాన్ని నిర్మించగలమని ఏసీబీ అధికారులు విశ్వసిస్తున్నారు. భవిష్యత్తులో కూడా అవినీతిపై ఏసీబీ తన దూకుడును కొనసాగించే అవకాశం ఉంది.
Read Also : 71st National Film Awards : బాలా మావయ్యకు అభినందనలు – నారా లోకేష్