ఈ రోజుల్లో డయాబెటిస్ (Diabetes) లేదా మధుమేహం సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. అనారోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామానికి దూరంగా ఉండటం, అధిక ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవడం వంటివే దీనికి ప్రధాన కారణాలు. ఒకసారి డయాబెటిస్ (Diabetes) వచ్చిన తరువాత, జీవనశైలిలో మార్పులు తేవాల్సిన అవసరం తప్పదు. ముఖ్యంగా, తీపి పదార్థాల వాడకంపై నియంత్రణ అవసరం.

చాలామంది డయాబెటిక్ (Diabetes) రోగులు చక్కెరను వాడటం మానేస్తారు. అయితే బెల్లం సహజమైనదని, పోషకాలతో నిండినదని భావించి దానిని ఆరోగ్యానికి మంచిదిగా భావిస్తున్నారు. మరి నిజంగా బెల్లం ,చక్కెర (Jaggery, sugar) కంటే మంచిదేనా? మధుమేహ రోగులు దాన్ని వినియోగించవచ్చా?
బెల్లం Vs చక్కెర – సరైన పోలిక
చక్కెర అనేది పూర్తిగా శుద్ధి చేసిన ఉత్పత్తి. ఇది కేవలం ఖాళీ కేలరీలు ఇస్తుంది. దానికి పోషకాలేమీ ఉండవు. కానీ బెల్లం సహజంగా తయారవుతుంది. ఇందులో కొంతమేరకు ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు లభిస్తాయి. అయినప్పటికీ, బెల్లం లోనూ ప్రధానంగా సుక్రోజ్ అనే షుగర్ రూపమే ఉంటుంది. దీన్ని కూడా శరీరం గ్లూకోజ్‌గా మార్చుతుంది.
గ్లైసెమిక్ ఇండెక్స్ – షుగర్ పెరిగే వేగాన్ని కొలిచే సాధనం
గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అనేది ఆహారం రక్తంలో చక్కెర స్థాయిని ఎంత త్వరగా పెంచుతుందో కొలిచే సూచిక. GI స్కేల్‌లో చక్కెరకి విలువ 70–75 మధ్యలో ఉంటుంది. బెల్లానికి GI మరింత ఎక్కువగా, అంటే 80–85 వరకూ ఉంటుంది. దీని అర్థం బెల్లం రక్తంలో షుగర్ లెవల్స్‌ను చక్కెర కంటే త్వరగా పెంచే అవకాశం ఉంది.
మితంగా తీసుకుంటేనే ప్రయోజనం
బెల్లం ఖచ్చితంగా కొన్ని సూక్ష్మ పోషకాలతో నిండినదే. ఆయుర్వేదం ప్రకారం ఇది జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది, టాక్సిన్లను బయటకు పంపించడంలో ఉపయోగపడుతుంది. కానీ, ఇది కూడా చివరికి చక్కెర సమానమైన కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. ఒక చెంచా చక్కెరకు బదులుగా రెండు చెంచాల బెల్లం తింటే షుగర్ ఇన్‌టేక్ ఎక్కువ అవుతుంది. పోషకాలు ఉన్నప్పటికీ, బెల్లం అధిక మొత్తంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. ఇక, చక్కెర కూడా రక్తంలో వేగంగా షుగర్ లెవల్స్ పెంచుతుంది.

పోషకాహార నిపుణుల అభిప్రాయం
ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రీటా జైన్ మాట్లాడుతూ – చక్కెర కానీ, బెల్లం కానీ మధుమేహ రోగులు పరిమితంగా తీసుకోవాలి అంటున్నారు. ఎక్కువ తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంది. రోజుకు 1–2 టీ స్పూన్లకంటే ఎక్కువ తీసుకోరాదు అని సలహా ఇస్తున్నారు.
బెల్లం వాడేటప్పుడు జాగ్రత్తలు
బెల్లం సహజ ఉత్పత్తే అయినా, కొన్ని రకాల బెల్లంలో రంగును మెరుగుపరచడం లేదా గట్టిగా ఉండేందుకు రసాయనాలు కలిపే అవకాశముంటుంది. కనుక మార్కెట్‌లో మిగతా మిత శుద్ధి చేయబడిన, డార్క్ కలర్ ఉన్న బెల్లం ఎంపిక చేయాలి. అది సహజమైనదిగా ఉండే అవకాశమూ ఉంటుంది.
మీ శరీర పరిస్థితికి అనుగుణంగా
చక్కెర మరియు బెల్లం రెండింటినీ మధుమేహ పేషెంట్లు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ, వాటిని మితంగా వినియోగించాల్సిన అవసరం ఉంది. అధిక షుగర్ లెవల్స్ ఉన్నవారు, ఇన్సులిన్ డిపెండెంట్ వ్యక్తులు తీపి పదార్థాలపై మరింతగా అప్రమత్తంగా ఉండాలి. నేచురల్ షుగర్స్ అయినా, తగిన డోసు మించితే ప్రమాదమే.
బెల్లం అంటే సహజ పదార్థం కదా, డయాబెటిస్ ఉన్నవారు తీసుకోచ్చా?
బెల్లం సహజంగా తయారు అవుతుంది మరియు కొన్ని ఖనిజాలు (ఇనుము, మెగ్నీషియం, పొటాషియం) కలిగి ఉంటుంది. అయితే, ఇందులో ఎక్కువ భాగం సుక్రోజ్ ఉండడం వల్ల ఇది రక్తంలో షుగర్ లెవల్స్‌ను వేగంగా పెంచుతుంది. కాబట్టి, మధుమేహ రోగులు బెల్లాన్ని కూడా పరిమిత పరిమాణంలోనే తీసుకోవాలి.
బెల్లం చక్కెర కంటే ఆరోగ్యానికి మంచిదా?
బెల్లం కొన్ని పోషకాలు కలిగి ఉండటంతో ఆరోగ్యానికి కొంతమేరకు మేలు చేస్తుంది. కానీ మధుమేహ ఉన్నవారి దృష్టిలో, ఇది కూడా చక్కెరలా గ్లూకోజ్‌గా మారి షుగర్ లెవల్స్ పెంచుతుంది. అందుకే, ఇది “చక్కెర కంటే ఆరోగ్యకరమైనది” అనే భావనను తేలికగా నమ్మకూడదు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Overthinking: ఓవర్ థింకింగ్ ఎంత ప్రమాదమో తెలుసా? నిపుణులు ఏమంటున్నారంటే!