దేశంలో యువతను ప్రభావితం చేస్తూ, అసభ్య కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్న అడల్ట్ మొబైల్ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. అశ్లీల దృశ్యాలు, అభ్యంతరకరమైన ప్రకటనలు, పోర్నోగ్రఫీ వంటి కంటెంట్‌ను అందిస్తున్న 25 యాప్‌లను బ్లాక్ చేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు (ISPs) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వీటితో పాటు Google Play Store, Apple App Storeల నుంచి కూడా ఈ యాప్‌లను తొలగించాలన్న సూచనలు పంపించాయి.
ఈ యాప్‌లు IT చట్టం 2000, Intermediary Guidelines & Digital Media Ethics Code 2021, భారతీయ న్యాయసంహిత సెక్షన్ 294 (2023), Indecent Representation of Women (Prohibition) Act, 1986 లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని కేంద్రం పేర్కొంది. మహిళలను అభ్యంతరకరంగా చూపించే విధంగా ఉన్న ఈ కంటెంట్ సమాజాన్ని పాడుచేస్తోందని పేర్కొంటూ, ఇటువంటి యాప్‌లను నిషేధించడం తప్పనిసరైందని కేంద్రం భావిస్తోంది.
ప్రముఖంగా యువతలో ఎక్కువగా ఉపయోగించబడుతున్న ULLU, ALTT, Desiflix, Big Shots App, Boomex వంటి యాప్‌లు ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు HotX VIP, NeonX VIP, ShowX, Gulab App, Triflicks, Adda TV, Feneo వంటి మొత్తం 25 యాప్‌లు ఉన్నాయి. ఈ యాప్‌ల్లో కనిపించే వీడియోలు, ప్రకటనలు మహిళల గౌరవాన్ని తగ్గించేవిగా, దేశ చట్టాలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని కేంద్రం నిర్దేశించింది.
ఇకపై ఈ యాప్‌లు ఇంటర్నెట్ ద్వారా ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాల్సిందేనని స్పష్టమైన హెచ్చరిక ఇచ్చింది. IT చట్టంలోని సెక్షన్ 79(3)(b) ప్రకారం ISPs అటువంటి కంటెంట్‌ను నిరోధించకపోతే, వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. డిజిటల్ మీడియా, OTT ప్లాట్‌ఫార్మ్‌లు భారత చట్టాలకు లోబడి పనిచేయాలని, విరుద్ధంగా వ్యవహరించినట్లయితే తీవ్ర చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
Read Also : fig fruit : అంజీర్ ఎలా తింటే ఆరోగ్యానికి మేలు?