తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి జన జీవనం తీవ్రంగా దెబ్బతింది. ట్రాఫిక్ నిలిచిపోవడం, విద్యుత్ సప్లై అంతరాయం వంటి సమస్యలు తలెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పిల్లల రవాణా కష్టమే – తల్లిదండ్రుల ఆవేదన
ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లలను పాఠశాలలకు (Schools) పంపించడం ఎంతో ప్రమాదకరమని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉండడం వల్ల పిల్లలు ప్రయాణించడం కష్టంగా మారింది. ముఖ్యంగా ఆటోలు, బస్సులు నడవడంలో అంతరాయమవుతుండటంతో పిల్లల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇదే నేపథ్యంలో పాఠశాలలకు తాత్కాలికంగా సెలవులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై ఎదురుచూపులు
ఇవాళ కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో తల్లిదండ్రులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు ఇంకా కురిస్తే స్కూళ్లకు వెళ్లే పరిస్థితి లేదని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ స్థాయిలో ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. వాతావరణ పరిస్థితుల్ని గమనించి ప్రభుత్వమే త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.